Vijay | తమిళ స్టార్ హీరో విజయ్ ప్రస్తుతం రాజకీయాల్లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. సినిమాల ద్వారా కోట్లాది అభిమానులను సంపాదించిన విజయ్, ఇప్పుడు రాజకీయాల్లో సత్తా చాటాలని ప్రయత్నిస్తున్నారు. తమిళనాడు ముఖ్యమంత్రి పీఠమే లక్ష్యంగా ఆయన తమిళగ వెట్రి కజగం అనే పార్టీని స్థాపించి, రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన వ్యక్తిగత జీవితం కూడా తరచూ వార్తల్లో నిలుస్తోంది. ముఖ్యంగా ఆయన భార్య సంగీతత తో విడాకుల వ్యవహారం తమిళ సినీ, రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చకు దారి తీసింది. దాదాపు రెండు దశాబ్దాలకు పైగా కొనసాగిన తమ వైవాహిక జీవితానికి ముగింపు పలకాలని ఆమె నిర్ణయించుకోవడం హాట్ టాపిక్‌గా మారింది. ఈ కేసుకు సంబంధించి వచ్చే ఏప్రిల్ 20న విచారణ జరగనుండగా, ఆ రోజున విజయ్ కోర్టుకు హాజరుకావాలని న్యాయస్థానం నోటీసులు జారీ చేసినట్లు సమాచారం.
ఇదిలా ఉండగా విజయ్ కుటుంబానికి సంబంధించిన మరో ఆసక్తికర పరిణామం తాజాగా కోలీవుడ్ వర్గాల్లో చర్చనీయాంశమైంది. విజయ్ కుమారుడు జాసన్ సంజయ్ తన పేరులో ఉన్న ఇన్షియల్‌ను మార్చుకున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. సాధారణంగా తమిళనాడులో పిల్లలు తమ తండ్రి పేరులోని మొదటి అక్షరాన్ని తమ పేరుకు ఇన్షియల్‌గా ఉపయోగించడం ఆనవాయితీ. అయితే జాసన్ సంజయ్ మాత్రం తన తండ్రి విజయ్ పేరుతో వచ్చే ‘వి’ అక్షరాన్ని తొలగించి, తన తల్లి సంగీత పేరులోని ‘ఎస్’ అక్షరాన్ని ఉపయోగిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ వార్తలు ఇప్పుడు కోలీవుడ్‌లో పెద్ద చర్చకు దారి తీసాయి.
ప్రస్తుతం జాసన్ సంజయ్ సినీ రంగంలో దర్శకుడిగా అడుగుపెడుతున్నాడు. ‘సిగ్మా’ అనే చిత్రంతో ఆయన దర్శకుడిగా పరిచయం కానున్నాడు. అయితే ఆ సినిమా టైటిల్ కార్డులో తన తండ్రి పేరుకు సంబంధించిన ఇన్షియల్‌ను ఉపయోగించకపోవడం మరింత ఆసక్తికరంగా మారింది. విజయ్ కుటుంబంలో జరుగుతున్న పరిణామాల నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నాడా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే విజయ్–సంగీత విడాకుల వ్యవహారం అభిమానులను కలవరపెడుతుండగా, ఇప్పుడు జాసన్ సంజయ్ ఇన్షియల్ మార్పు వార్తలు అభిమానులలో కూడా చర్చనీయాంశంగా మారాయి.అయితే ఈ విషయంపై కుటుంబ సభ్యుల నుంచి అధికారికంగా ఎలాంటి ప్రకటన ఇంకా వెలువడలేదు. మొత్తానికి విజయ్ రాజకీయాల్లో బిజీగా ఉన్న సమయంలో ఆయన కుటుంబానికి సంబంధించిన ఈ పరిణామాలు తమిళ సినీ, రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు కారణమవుతున్నాయి.