రామగిరి, ఫిబ్రవరి 26 : నల్లగొండలోని మహాత్మా గాంధీ యూనివర్సిటీ విద్యార్థి సంఘాల నాయకులకు నార్కట్పల్లి పోలీసులు గురువారం కౌన్సిలింగ్ నిర్వహించారు. ఇటీవలి కాలంలో వివిధ సమస్యలపై ఎంఎస్ఎఫ్, ఏబీవీపీ, బీసీ విద్యార్థి సంఘాలు, ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్ వంటి వివిధ విద్యార్థి సంఘాలు వర్సిటీలో ఆందోళనలను తీవ్రతరం చేసిన సంగతి తెలిసిందే. ఈ నిరసనలు యూనివర్సిటీ ప్రధాన గేటుకు తాళం వేసే వరకు వెళ్లాయి. ఓ దశలో ఎమ్మెల్సీ శంకర్ నాయక్ వర్సిటీకి చేరుకుని పరిస్థితులను సమీక్షించారు. ఈ సంఘటనను ప్రభుత్వం సీరియస్గా తీసుకోవడంతో వైస్ చాన్సలర్ ఖాజా అల్తాఫ్ హుస్సేన్ స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో నేడు నార్కెట్పల్లి పోలీసులు యూనివర్సిటీ విద్యార్థి సంఘాల నాయకులను పిలిపించి కౌన్సిలింగ్ నిర్వహించారు.
యూనివర్సిటీలో అశాంతి పరిస్థితులు నెలకొనకుండా శాంతియుతంగా ఉండాలని సూచించారు. సూచనలు, సలహాలు ఖాతరు చేయకుండా వ్యవహరిస్తే కేసులు సైతం నమోదు చేయాల్సి వస్తుందని హెచ్చరించారు. అధికారుల హెచ్చరికలతో విద్యార్థి సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. యూనివర్సిటీ సమస్యల పరిష్కారానికి నిరంతరం పోరాటాలు చేస్తూ వస్తున్న విద్యార్థి సంఘాలను వర్సిటీ అధికారులు పోలీసుల సహాయంతో అణచివేయాలని ప్రయత్నిస్తున్నట్లు విద్యార్థి నాయకులు ఆరోపిస్తున్నారు. మరోవైపు యూనివర్సిటీ పరిపాలన యంత్రాంగం మాత్రం క్యాంపస్లో శాంతి భద్రతలు కాపాడటానికి అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు చెబుతోంది.