బ్యాంకాక్, జూలై 24: థాయ్‌లాండ్, కంబోడియాలో యుద్ధమేఘాలు కమ్ముకున్నాయి. సరిహద్దుల పొడవున అనేక ప్రాంతాలలో ఇరుదేశాలకు చెందిన సైనికుల మధ్య భీకర ఘర్షణలు చెలరేగాయి. ఈ ఘర్షణలలో ఓ సైనికుడితోపాటు 10 మంది థాయ్ పౌరులు మరణించారు. మరో 28 మంది గాయపడ్డారు. తమ సైనిక చెక్‌పోస్టులతోపాటు పౌర దవాఖానపై కంబోడియా సైన్యం వైమానిక దాడులు జరిపినట్లు థాయ్ ఆరోపించింది. గురువారం ఉదయం ఘర్షణలు ప్రారంభం కావడంతో థాయ్‌కు చెందిన ప్రజలు తమ ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో కనిపించాయి.
సరిహద్దు పొడవున ఆరు ప్రాంతాలలో ఘర్షణలు జరుగుతున్నట్లు థాయ్ రక్షణ శాఖ ప్రతినిధి సురసంత్ కాంగ్‌సిరి తెలిపారు. బుధవారం థాయ్‌లో జరిగిన మందుపాతర పేలుడు తాజా ఘర్షణలకు పురిగొల్పింది. ఈ పేలుడులో ఐదుగురు థాయ్ సైనికులు గాయపడ్డారు.ఈ మందుపాతర పేలుడుకు కంబోడియా కారణమని థాయ్ ఆరోపించగా, అది ఏనాటి మందుపాతరో అయి ఉండవచ్చని, దీంతో తమకు సంబంధం లేదని కంబోడియా జవాబిచ్చింది.
ఈ నేపథ్యంలో కంబోడియాలోని తన రాయబారిని ఉపసంహరించుకున్న థాయ్ తమ దేశంలోని కంబోడియా రాయబారిని దేశం నుంచి బహిష్కరించింది. అన్ని సరిహద్దు చెక్‌పోస్టులను మూసివేసిన థాయ్.. కంబోడియాలోని తమ పౌరులు ఆ దేశాన్ని వీడాలని పిలుపునిచ్చింది.
తాజా ఘర్షణలకు ఎవరు బాధ్యత వహించాలన్న విషయమై ఇరు దేశాలు పరస్పరం నిందలు వేసుకుంటున్నాయి. థాయ్‌లాండ్‌కు చెందిన సురిన్ ప్రావిన్సులోని సరిహద్దు వెంబడి ఉన్న ప్రాచీన ముయెన్ థోమ్ ఆలయం సమీపంలో గురువారం ఉదయం మొదటి ఘర్షణలు జరిగాయి. తమ సరిహద్దు వైపు రావద్దని కంబోడియా సైనికులకు చెప్పినప్పటికీ వారు థాయ్ సైనిక పోస్టుపై ముందుగా కాల్పులు జరిపారని థాయ్ సైన్యం వివరించింది. అయితే కంబోడియా రక్షణ శాఖ ఈ వాదనను ఖండించింది. ఎటువంటి కవ్వింపు చర్యలు లేకుండా తమ సైన్యంపై కాల్పులు ప్రారంభించిన థాయ్ సైన్యానికి గట్టిగా సమాధానమిచ్చినట్లు తెలిపింది.
శతాబ్దాలుగా తమ మధ్య సాగుతున్న వైరానికి ముగింపు పలికేందుకు థాయ్‌లాండ్, కంబోడియా గత ఏడాది థాయ్-కంబోడియన్ మైత్రీ వంతెన వద్ద శాశ్వత సరిహద్దు చెక్‌పాయింట్‌ను ఏర్పాటు చేసుకున్నాయి. అయితే ఈ మైత్రీ బంధం ఎక్కువ కాలం నిలవలేదు. ఏడాది తర్వాత రెండు దేశాల మధ్య భీకర ఘర్షణలు జరిగాయి. రెండు దేశాల మధ్య శతాబ్దాలుగా నలుగుతున్న సరిహద్దు వివాదానికి మూల కారణం 1,000 సంవత్సరాల పూర్వం నాటి హిందూ ఆలయం. థాయ్‌లాండ్, కంబోడియా మధ్య 800 కిలోమీటర్ల పొడవైన సుదీర్ఘ సరిహద్దు ఉంది. 1863 నుంచి 1953 మధ్య కంబోడియాను ఆక్రమించుకుని పాలించిన ఫ్రెంచ్ వలస పాలకులు ఈ సరిహద్దును నిర్ణయించారు.
సరిహద్దుపై 1907లో ఓ ఒప్పందం కుదిరింది. అయితే 11వ శతాబ్దానికి చెందిన హిందూ ఆలయం(ప్రే విహార్) కంబోడియా భూభాగంలో ఉండడాన్ని థాయ్‌లాండ్ అనంతర కాలంలో వ్యతిరేకించింది. ఈ ఆలయం ఉన్న ప్రాంతం తమ భూభాగంలోకి వస్తుందని థాయ్‌లాండ్ పట్టుపట్టింది. అయితే దీన్ని వ్యతిరేకించిన కంబోడియా 1959లో అంతర్జాతీయ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. కంబోడియాకు అనుకూలంగా కోర్టు తీర్పు చెప్పింది. ఈ తీర్పును తీవ్రంగా నిరసించిన థాయ్‌లాండ్ ఘర్షణలకు దిగడంతో రెండు దేశాల మధ్య దశాబ్దాలుగా పోరు కొనసాగుతూనే ఉంది.