పాట్నా: బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో మహాఘటబంధన్ కూటమికి నేతృత్వం వహించిన రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ)కే ఎక్కువ ఓట్లు పోల్ అయ్యాయి. (Bihar election results) అయితే ఎన్డీయే కూటమికి చెందిన బీజేపీ, జేడీ(యూ)కు అత్యధిక సీట్లు దక్కాయి. మొత్తం 243 అసెంబ్లీ స్థానాలకుగాను ఎన్డీఏ కూటమి 202 స్థానాలు గెలుచుకున్నది. చెరో 101 స్థానాల్లో పోటీ చేసిన బీజేపీ 89 సీట్లు, నితీశ్ కుమార్ నేతృత్వంలోని జేడీ(యూ) 85 సీట్లు గెలుచుకున్నాయి. కేంద్ర మంత్రి చిరాగ్ పాశ్వాన్ నేతృత్వంలోని లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్) 19 సీట్లు, కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీ నేతృత్వంలోని హిందుస్తానీ అవామ్ మోర్చా (హెచ్ఏఎం) 5 సీట్లు, రాజ్యసభ ఎంపీ ఉపేంద్ర కుష్వాహా నేతృత్వంలోని రాష్ట్రీయ లోక్ మోర్చా 4 సీట్లలో విజయం సాధించాయి.
కాగా, మహాఘటబంధన్ కూటమికి నేతృత్వం వహించిన ఆర్జేడీ 144 స్థానాల్లో పోటీ చేసింది. అయితే 25 సీట్లలో మాత్రమే విజయం సాధించింది. కాంగ్రెస్ పార్టీ 61 సీట్లలో పోటీ చేయగా కేవలం 6 స్థానాల్లో గెలుపొందింది. సీపీఐ(ఎంఎల్) రెండు సీట్లు, సీపీఐ(ఎం) ఒక సీటు దక్కించుకోగా సీపీఐ ఏదీ గెలుచుకోలేదు. దీంతో మహాఘటబంధన్ కూటమి 35 సీట్లకే పరిమితమైంది.

Bihar Results
మరోవైపు ఓటు శాతాన్ని పరిశీలిస్తే బీహార్ ప్రజలు ఆర్జేడీకే ఎక్కువ ఓట్లు వేశారు. ఆ పార్టీ 23 శాతం ఓట్లు సాధించింది. అయితే గత ఎన్నికల్లో 23.11 శాతం ఉండగా ఈసారి స్వల్పంగా తగ్గింది. 144 స్థానాల్లో పోటీ చేసిన ఆర్జేడీకి మొత్తం 1,15,46,055 ఓట్లు పోలయ్యాయి. అయితే కేవలం 25 సీట్లలోనే ఆ పార్టీ విజయం సాధించింది. సుమారు 42 సీట్లు స్వల్ప ఓట్ల తేడాతో కోల్పోయింది.
కాగా, బీజేపీ ఓట్ల శాతం ఈసారి మరింత పెరిగింది. 2020 ఎన్నికల్లో 19.46 శాతం ఉండగా ఈసారి 20.07 శాతానికి పెరిగింది. గత ఎన్నికల్లో 110 నియోజకవర్గాల్లో పోటీ చేసిన బీజేపీ ఈ ఎన్నికల్లో 101 సీట్లకే పరిమితమైంది. అయినప్పటికీ 1,00,81,143 మంది ఓటర్లు బీజేపీకి ఓటు వేశారు. జేడీ(యూ)కు 19.25 శాతం ఓట్లు పోలయ్యాయి.

Partywise Voting Share
Also Read:
RK Singh Suspended | బీహార్‌లో రెబల్స్‌పై బీజేపీ చర్యలు.. మాజీ మంత్రితో సహా ముగ్గురు నేతలు సస్పెండ్
AAP Won Tarn Taran Bypoll | పంజాబ్‌లోని తర్న్ తరన్ ఉప ఎన్నికల్లో.. ఆప్ విజయం
Watch: ఖరీదైన కారులో వచ్చి.. వార్తాపత్రికను దొంగిలించిన వ్యక్తి