Ranya Rao | బంగారం స్మగ్లింగ్ కేసులో అరెస్టయిన కన్నడ నటి రన్యారావు డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI) అధికారులపై సంచలన ఆరోపణలు చేశారు. కస్టడీలో తనను శారీరకంగా హింసించినట్లు చెప్పారు. పలుమార్లు చెంపదెబ్బలు కొట్టారని, ఆహారం కూడా ఇవ్వలేదని, తెల్లకాగితాలపై సంతకాలు చేయించుకున్నట్లు ఆరోపించారు. ఈ మేరకు డీఆర్ఐ అదనపు డైరెక్టర్ జనరల్‌కు ఆమె లేఖ రాశారు. తనను తప్పుడు కేసులో ఇరికించినట్లు లేఖలో పేర్కొన్నారు.
రన్యా రావు దుబాయ్ నుంచి రూ.14 కోట్లకు పైగా విలువైన బంగారం స్మగ్లింగ్ చేస్తూ బెంగళూరు విమానాశ్రయంలో ఈనెల 3న పట్టుబడిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆమె బెంగళూరులోని పరప్పన అగ్రహార జైలులో ఉన్నారు. అయితే, తాను ఏతప్పూ చేయలేదని.. తప్పుడు కేసులో ఇరికించారంటూ పేర్కొన్నారు. తనను విమానంలోనే అరెస్ట్ చేసినట్లు చెప్పారు. వివరణ ఇవ్వడానికి కూడా అధికారులు అవకాశం ఇవ్వలేదని ఆరోపించారు.
ఇక కస్టడీలో తనపై అధికారులు పదేపదే దాడులు చేసినట్లు ఆరోపించారు. ‘అరెస్ట్ అయిన క్షణం నుంచి కోర్టులో హాజరుపరిచే వరకూ అధికారులు నాపై శారీరకంగా దాడి చేశారు. 10 నుంచి 15 సార్లు చెంపదెబ్బలు కొట్టారు. డీఆర్ఐ అధికారులు తయారు చేసిన స్టేట్మెంట్ల, 40 ఖాళీ పేపర్లపై సంతకం చేయమని ఒత్తిడి తెచ్చారు. పదేపదే దాడి చేసినప్పటికీ సంతకాలు చేసేందుకు నేను నిరాకరించారు. బలవంతంగా నాతో సంతకాలు చేయించుకున్నారు. మార్చి 3న సాయంత్రం 6:45 గంటల నుంచి మార్చి 4న సాయంత్రం 7:50 గంటల వరకూ నన్ను నిర్బంధంలో ఉంచారు. అప్పుడు నిద్రపోడానికి కూడా అనుమతించలేదు. ఆహారం కూడా నిరాకరించారు’ అని రన్యారావు లేఖలో ఆరోపించారు.
అంతేకాదు, ఈ కేసులో తనకు ఎలాంటి సంబంధం లేదని నటి పేర్కొన్నారు. తన నుంచి బంగారం స్వాధీనం చేసుకోలేదని లేఖలో ప్రస్తావించారు. ఢిల్లీకి చెందిన కొందరు వ్యక్తులు ఈ కేసులోని ఇతర అనుమానితులను రక్షించేందుకు తనను తప్పుడు కేసులో ఇరికించారని రన్యారావు ఆరోపించారు. ఇక ఈ కేసులో తన సవతి తండ్రి ప్రమేయం లేదని రన్యారావు లేఖలో స్పష్టం చేశారు.
అయితే, మార్చి 7న డీఆర్ఐకి ఇచ్చిన వాంగ్మూలంలో రన్యారావు వాదన మరోలా ఉంది. అప్పుడు తాను బంగారం స్మగ్లింగ్‌కు పాల్పడినట్లు నటి ఒప్పుకుంది. తన వద్ద నుంచి 17 బంగారు కడ్డీలను అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు కూడా తెలిపింది. ఆ తర్వాత మార్చి 10న రన్యా రావు కోర్టులో హాజరుపరచగా.. తనపై ఎలాంటి దాడీ జరగలేదని పేర్కొంది. డీఆర్ఐ అధికారుల ప్రశ్నలకు సమాధానం ఇవ్వడం ఆపేసినప్పుడు తనను మాటలతో దుర్భాషలాడుతున్నారని నటి పేర్కొన్నారు. ‘వారు నన్ను కొట్టలేదు, కానీ మాటలతో తీవ్రంగా దుర్భాషలాడారు. అది నాకు తీవ్ర మానసిక క్షోభ కలిగించింది’ అని రన్యారావు న్యాయమూర్తి ముందు వాపోయింది. అయితే, ఇప్పుడు మాత్రం తనను శారీరకంగా హించించారంటూ చెప్పడం పలు అనుమానాలకు తావిస్తోంది.
కస్టడీలో ఉన్న నటి రన్యారావు శరీరంపై గాయాలు..
ఈ కేసులో రన్యారావును డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు విచారిస్తున్నారు. ఈ క్రమంలో నటికి సంబంధించిన ఓ ఫొటో ఇటీవలే వైరల్ అయిన విషయం తెలిసిందే. కళ్ళు వాచి, ముఖంపై గాయాలతో ఫొటో వైరల్‌గా మారింది. దీంతో కస్టడీలో ఆమెపై అధికారులు దాడి చేసి ఉంటారని చర్చ జరుగుతోంది. దీనిపై మహిళా సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. అయితే, నటి ఒంటిపై గాయాల అంశంపై డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ స్పందించింది. ఆమె శరీరంపై పలుచోట్ల గాయాలున్నాయని పేర్కొంది. అయితే దుబాయ్‌కి వెళ్లడానికి చాలాకాలం ముందే తనకు ఈ గాయాలు అయ్యాయని నటి తెలిపినట్లు అధికారులు అప్పట్లో వెల్లడించారు. దీంతో అవసరమైన వైద్య సాయం అందించాలని జైలు అధికారులను కోర్టు ఆదేశించినట్లు చెప్పారు.
బంగారం స్మగ్లింగ్..
రన్యా రావు దుబాయ్ నుంచి రూ.14 కోట్లకు పైగా విలువైన బంగారం స్మగ్లింగ్ చేస్తూ బెంగళూరు విమానాశ్రయంలో పట్టుబడిన విషయం తెలిసిందే. ఆమెను అరెస్ట్ చేసిన అనంతరం డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఎస్) అధికారులు లావెల్లె రోడ్‌లోని ఆమె ఇంటిలో సోదాలు నిర్వహించగా రూ.2.06 కోట్ల విలువైన బంగారు నగలు, రూ.2.67 కోట్ల నగదు పట్టుబడ్డాయి. దీంతో పట్టుబడిన మొత్తం నగదు, బంగారం విలువ 17.29 కోట్లుగా అధికారులు నిర్ధారించారు.
దుబాయ్ నుంచి 17 కడ్డీలు తీసుకొచ్చా..
విచారణలో భాగంగా రన్యారావు కీలక విషయాలు వెల్లడించింది. తాను దుబాయ్ నుంచి 17 బంగారు కడ్డీలను తీసుకుని వచ్చినట్టు ఆమె రెవెన్యూ అధికారులకు తెలిపింది. తాను దుబాయే కాక మధ్య ప్రాచ్య, యూరప్, అమెరికా, సౌదీ అరేబియా దేశాలు పర్యటించినట్టు తెలిపింది. ఈ ప్రయాణాల కారణంగా ప్రస్తుతం అలసిపోయానని, తనకు కొంత విశ్రాంతి కావాలని ఆమె కోరింది. తన తండ్రి కేఎస్ హెగ్డేష్ రియల్ ఎస్టేట్ వ్యాపారి అని, తన భర్త జతీన్ హుక్కేరి ఆర్కిటెక్ట్ అని వివరించింది. తన విచారణ అంతా సక్రమంగానే సాగుతున్నదని, ఎలాంటి ఒత్తిడి లేకుండా స్వచ్ఛందంగానే తాను ఈ ప్రకటన ఇస్తున్నానని తెలిపింది. స్మగ్లింగ్‌లో రన్యారావు పాత్రధారే తప్ప సూత్రధారి కాదని, ఇండో-ఆసియన్ న్యూస్ తన కథనంలో పేర్కొంది. దుబాయ్ నుంచి ఆమె బంగారాన్ని తెచ్చినందుకు కేజీకి 4-5 లక్షలు తీసుకుంటుందని తెలిపింది.
రన్యారావుకు బెయిల్ నిరాకరణ
రన్యారావుకు ఆర్థిక నేరాలకు సంబంధించిన ప్రత్యేక కోర్టు శుక్రవారం బెయిల్ నిరాకరించింది. ఆమెపై దాఖలైన అభియోగాలు చాలా తీవ్రమైనవని, ఆమె జ్యుడీషియల్ కస్టడీలోనే ఉండాలని న్యాయమూర్తి విశ్వనాథ్ సీ గౌడర్ తెలిపారు. బంగారం స్మగ్లింగ్ కేసులో అరెస్టయిన రన్యారావు మొదట బెయిల్ కోసం మెజిస్ట్రేట్ కోర్టులో పిటిషన్ వేశారు. కోర్టు తిరస్కరించడంతో ఆమె ప్రత్యేక కోర్టును ఆశ్రయించగా అక్కడ కూడా ఆమె పిటిషన్ తిరస్కరణకు గురైంది. బెయిల్ కోసం సెషన్స్ కోర్టును ఆశ్రయించాలని రన్యారావు న్యాయవాదులు నిర్ణయించారు.
Also Read..
“యూట్యూబ్ చూసి స్మగ్లింగ్ నేర్చుకున్నా రన్యారావు వెల్లడి”
“Ranya Rao | ‘రన్యారావుకు మీరే అండ.. కాదు మీరే అండ..’ బీజేపీ, కాంగ్రెస్ బ్లేమ్ గేమ్..!”