Ranya Rao : కన్నడ నటి (Kannada Actress) రన్యారావు (Ranya Rao) బంగారం స్మగ్లింగ్ (Godl smuggling) చేస్తూ ఇటీవల బెంగళూరు ఎయిర్‌పోర్టు (Bengalore Airport) లో పట్టుబడింది. దీనిపై ఇప్పుడు కర్ణాటకలో అధికార కాంగ్రెస్ (Congress), ప్రతిపక్ష బీజేపీ (BJP) బ్లేమ్ గేమ్ ఆడుతున్నాయి. రన్యారావుకు మీరు అండగా ఉన్నారని బీజేపీ ఆరోపిస్తే.. లేదు మీరే అండగా ఉన్నారని కాంగ్రెస్ ప్రత్యారోపణలు చేస్తోంది. రన్యారావు అరెస్టును తప్పించేందుకు ఇద్దరు రాష్ట్ర మంత్రులు ప్రయత్నించారని కర్ణాటక బీజేపీ ఆరోపించగా.. బీజేపీ హయాంలో రన్యారావుకు ప్రభుత్వ భూమి కేటాయించారెందుకని కాంగ్రెస్ ప్రశ్నిస్తోంది.
రన్యారావు బంగారం స్మగ్లింగ్ చేసేందుకు వీలు కల్పించడం అతిపెద్ద ప్రభుత్వ ప్రొటోకాల్ ఉల్లంఘన అని కర్ణాటక బీజేపీ అధ్యక్షుడు విజయేంద్ర యెడియూరప్ప విమర్శించారు. ఈ మేరకు ఆయన తన ఎక్స్ ఖాతాలో ఒక పోస్టు పెట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వ ట్రాక్ రికార్డును బట్టి చూస్తే ఈ ఉల్లంఘన పెద్ద ఆశ్యర్యమేం కలిగించదని ఆయన తన పోస్టులో పేర్కొన్నారు. రన్యారావు పట్టుబడిన సందర్భంగా ఆమెను అరెస్ట్ కాకుండా విడిపించేందుకు సిద్ధరామయ్య ప్రభుత్వంలోని ఇద్దరు మంత్రులు ప్రయత్నించారని బీజేపీ ఆరోపించింది. ప్రభుత్వంలోని ప్రముఖుల సహకారం లేకుండా ఇంత భారీ స్మగ్లింగ్ సాధ్యం కాదని వ్యాఖ్యానించింది.
ప్రస్తుతం ఈ కేసులో సీబీఐ దర్యాప్తు జరుగుతోందని, దర్యాప్తులో కాంగ్రెస్ బండారం బయటపడుతుందని బీజేపీ చెబుతోంది. పిల్లి కళ్లు మూసుకుని పాలు తాగినట్లు కాంగ్రెస్ తీరు ఉన్నదని, కేసు దర్యాప్తులో నిజాలు బయటికి వస్తాయని పేర్కొంది. అయితే బీజేపీ స్టేట్ చీప్ విజయేంద్ర ఆరోపణలపై కాంగ్రెస్ స్పందించింది. కర్ణాటక హోంమంత్రి జీ పరమేశ్వర మాట్లాడుతూ.. ప్రస్తుతం ఈ కేసును సీబీఐ దర్యాప్తు చేస్తోందని, సీబీఐ దర్యాప్తు ముగిసే వరకు ఇలాంటి ఊహాగానాలు వస్తూనే ఉంటాయని అన్నారు.
రన్యారావు గోల్డ్ స్మగ్లింగ్‌కు రాష్ట్ర మంత్రుల సహకారం ఉందనే ఆరోపణల్లో నిజం లేదని పరమేశ్వర కొట్టిపారేశారు. బీజేపీ సహకారంతోనే రన్యారావు స్మగ్లింగ్ చేస్తుందేమోనని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. 2023లో బీజేపీ హయాంలోనే రన్యారావుకు ప్రభుత్వ భూమి కేటాయించారని, ఈ విషయంపై కూడా సీబీఐ దర్యాప్తు చేస్తుందని అన్నారు. రన్యారావుకు బీజేపీ సర్కారు భూమి ఎందుకు కేటాయించినట్టని ఆయన ప్రశ్నించారు.