Ranya Rao | బంగారం అక్రమ రవాణా (gold smuggling) కేసులో అరెస్టైన నటి రన్యారావు (Ranya Rao) వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఈ కేసుకు సంబంధించి ముమ్మర దర్యాప్తు కొనసాగుతోంది. ప్రస్తుతం రన్యా రావు డీఆర్ఐ కస్టడీలో ఉంది. డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు ఆమెను విచారిస్తున్నారు. వీఐపీ ప్రోటోకాల్‌ను దుర్వినియోగం చేస్తూ నటి రన్యారావు బంగారం అక్రమంగా రవాణా చేయడం రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతోంది.
ఈ నేపథ్యంలో ప్రొటోకాల్ దుర్వినియోగం అంశంపై కాంగ్రెస్ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ఈ వ్యవహారంలో రన్యారావు సవతి తండ్రి, కర్ణాటకలో ఐపీఎస్ అధికారి, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ) డాక్టర్ కె. రామచంద్రరావు పాత్రపై కూడా ప్రత్యేకంగా ద్యాప్తు చేయనుంది. రాష్ట్ర ప్రభుత్వం అదనపు ప్రధాన కార్యదర్శి గౌరవ్ గుప్తాను దర్యాప్తు అధికారిగా ప్రభుత్వం నియమించింది. దర్యాప్తును వెంటనే ప్రారంభించి వారంలోపు తుది నివేదికను అందించాలని ఆదేశించింది.
రన్యా రావు దుబాయ్ నుంచి రూ.14 కోట్లకు పైగా విలువైన బంగారం స్మగ్లింగ్ చేస్తూ బెంగళూరు విమానాశ్రయంలో పట్టుబడిన విషయం తెలిసిందే. రాన్యా ఇటీవతే తరచూ దుబాయ్ వెళ్లి వస్తుండడంతో ఆమెపై అధికారులు నిఘా పెట్టారు. 15 రోజుల్లో ఆమె నాలుగుసార్లు దుబాయ్ వెళ్లడాన్ని గమనించారు. ఎలాంటి అనుమానం రాకుండా.. గోల్డ్ బిస్కెట్లను దుస్తుల్లో దాచి, తీసుకొస్తున్నట్లు గుర్తించారు. ఆమెపై నిఘా పెట్టిన డీఆర్ఐ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఆమె ఎయిర్‌పోర్టులో దిగినప్పుడల్లా తాను డీజీపీ కూతురునని ప్రచారం చేసుకొనేదని తేలింది. ఆమెను అరెస్ట్ చేసిన అనంతరం డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఎస్) అధికారులు లావెల్లె రోడ్‌లోని ఆమె ఇంటిలో సోదాలు నిర్వహించగా రూ.2.06 కోట్ల విలువైన బంగారు నగలు, రూ.2.67 కోట్ల నగదు పట్టుబడ్డాయి. దీంతో పట్టుబడిన మొత్తం నగదు, బంగారం విలువ 17.29 కోట్లుగా అధికారులు నిర్ధారించారు.
విచారణలో భాగంగా రన్యారావు కీలక విషయాలు వెల్లడించింది. తాను దుబాయ్ నుంచి 17 బంగారు కడ్డీలను తీసుకుని వచ్చినట్టు ఆమె రెవెన్యూ అధికారులకు తెలిపింది. తాను దుబాయే కాక మధ్య ప్రాచ్య, యూరప్, అమెరికా, సౌదీ అరేబియా దేశాలు పర్యటించినట్టు తెలిపింది. ఈ ప్రయాణాల కారణంగా ప్రస్తుతం అలసిపోయానని, తనకు కొంత విశ్రాంతి కావాలని ఆమె కోరింది. తన తండ్రి కేఎస్ హెగ్డేష్ రియల్ ఎస్టేట్ వ్యాపారి అని, తన భర్త జతీన్ హుక్కేరి ఆర్కిటెక్ట్ అని వివరించింది. తన విచారణ అంతా సక్రమంగానే సాగుతున్నదని, ఎలాంటి ఒత్తిడి లేకుండా స్వచ్ఛందంగానే తాను ఈ ప్రకటన ఇస్తున్నానని తెలిపింది. స్మగ్లింగ్‌లో రన్యారావు పాత్రధారే తప్ప సూత్రధారి కాదని, ఇండో-ఆసియన్ న్యూస్ తన కథనంలో పేర్కొంది. దుబాయ్ నుంచి ఆమె బంగారాన్ని తెచ్చినందుకు కేజీకి 4-5 లక్షలు తీసుకుంటుందని తెలిపింది. కాగా, ఈ స్మగ్లింగ్ వెనుక ప్రముఖ రాజకీయ నేత హస్తం ఉన్నట్టు ప్రచారం జరుగుతున్నది.
Also Read..
“Ranya Rao | నటి రన్యా రావు వెనుక కాంగ్రెస్ మంత్రి!”
“Ranya Rao | ‘రన్యారావుకు మీరే అండ.. కాదు మీరే అండ..’ బీజేపీ, కాంగ్రెస్ బ్లేమ్ గేమ్..!”
“Ranya Rao | కస్టడీలో ఉన్న నటి రన్యారావు శరీరంపై గాయాలు.. డీఆర్ఐ అధికారులు ఏమన్నారంటే..?”