Ranya Rao | బంగారం అక్రమ రవాణా (gold smuggling) కేసులో అరెస్టైన నటి రన్యారావు (Ranya Rao) వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఈ కేసుకు సంబంధించి ముమ్మర దర్యాప్తు కొనసాగుతోంది. ప్రస్తుతం రన్యా రావు డీఆర్ఐ కస్టడీలో ఉంది. డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు ఆమెను విచారిస్తున్నారు. ఈ క్రమంలో నటికి సంబంధించిన ఓ ఫొటో ప్రస్తుతం వైరల్ అవుతోంది.
కళ్ళు వాచి, ముఖంపై గాయాలతో ఫొటో వైరల్‌గా మారింది. దీంతో కస్టడీలో ఆమెపై అధికారులు దాడి చేసి ఉంటారని చర్చ జరుగుతోంది. దీనిపై మహిళా సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో కర్ణాటక రాష్ట్ర మహిళా కమిషన్ (Karnataka Women Commission) శుక్రవారం నటి వైరల్ చిత్రంపై స్పందించింది. ఈ అంశంపై ఎవరైనా అధికారికంగా ఫిర్యాదు దాఖలు చేస్తే విచారణ చేపట్టనున్నట్లు పేర్కొంది. లేదంటే దర్యాప్తు నిర్వహించడానికి కమిషన్‌కు అధికారం లేదని పేర్కొంది. ‘నటి ఒంటిపై గాయాల విషయంలో ఎవరైనా మాకు ఫిర్యాదు చేయాలి. లేదంటే మహిళా కమిషన్ దర్యాప్తు నిర్వహించడానికి అధికారం లేదు’ అని కర్ణాటక రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ నాగలక్ష్మి చౌదరి అన్నారు.
అయితే, నటి ఒంటిపై గాయాల అంశంపై డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ స్పందించింది. ఆమె శరీరంపై పలుచోట్ల గాయాలున్నాయని పేర్కొంది. అయితే దుబాయ్‌కి వెళ్లడానికి చాలాకాలం ముందే తనకు ఈ గాయాలు అయ్యాయని నటి తెలిపినట్లు అధికారులు వెల్లడించారు. దీంతో అవసరమైన వైద్య సాయం అందించాలని జైలు అధికారులను కోర్టు ఆదేశించినట్లు చెప్పారు.
రన్యా రావు దుబాయ్ నుంచి రూ.14 కోట్లకు పైగా విలువైన బంగారం స్మగ్లింగ్ చేస్తూ బెంగళూరు విమానాశ్రయంలో పట్టుబడిన విషయం తెలిసిందే. ఆమెను అరెస్ట్ చేసిన అనంతరం డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఎస్) అధికారులు లావెల్లె రోడ్‌లోని ఆమె ఇంటిలో సోదాలు నిర్వహించగా రూ.2.06 కోట్ల విలువైన బంగారు నగలు, రూ.2.67 కోట్ల నగదు పట్టుబడ్డాయి. దీంతో పట్టుబడిన మొత్తం నగదు, బంగారం విలువ 17.29 కోట్లుగా అధికారులు నిర్ధారించారు.
విచారణలో భాగంగా రన్యారావు కీలక విషయాలు వెల్లడించింది. తాను దుబాయ్ నుంచి 17 బంగారు కడ్డీలను తీసుకుని వచ్చినట్టు ఆమె రెవెన్యూ అధికారులకు తెలిపింది. తాను దుబాయే కాక మధ్య ప్రాచ్య, యూరప్, అమెరికా, సౌదీ అరేబియా దేశాలు పర్యటించినట్టు తెలిపింది. ఈ ప్రయాణాల కారణంగా ప్రస్తుతం అలసిపోయానని, తనకు కొంత విశ్రాంతి కావాలని ఆమె కోరింది. తన తండ్రి కేఎస్ హెగ్డేష్ రియల్ ఎస్టేట్ వ్యాపారి అని, తన భర్త జతీన్ హుక్కేరి ఆర్కిటెక్ట్ అని వివరించింది. తన విచారణ అంతా సక్రమంగానే సాగుతున్నదని, ఎలాంటి ఒత్తిడి లేకుండా స్వచ్ఛందంగానే తాను ఈ ప్రకటన ఇస్తున్నానని తెలిపింది. స్మగ్లింగ్‌లో రన్యారావు పాత్రధారే తప్ప సూత్రధారి కాదని, ఇండో-ఆసియన్ న్యూస్ తన కథనంలో పేర్కొంది. దుబాయ్ నుంచి ఆమె బంగారాన్ని తెచ్చినందుకు కేజీకి 4-5 లక్షలు తీసుకుంటుందని తెలిపింది. కాగా, ఈ స్మగ్లింగ్ వెనుక ప్రముఖ రాజకీయ నేత హస్తం ఉన్నట్టు ప్రచారం జరుగుతున్నది.
Also Read..
Ranya Rao | రన్యారావు వెనక రాజకీయ నేత?
Ranya Rao: 17 బంగారు బిస్కెట్లు తీసుకొచ్చా.. వాంగ్మూలంలో రాన్యా రావు