బెంగళూరు, మార్చి 5: దుబాయ్ నుంచి స్మగ్లింగ్ చేస్తూ 14.5 కేజీల బంగారంతో సోమవారం బెంగళూరు ఎయిర్పోర్టులో పట్టుబడ్డ కన్నడ నటి రన్యారావు (31) ఇంటిలో పెద్దయెత్తున బంగారం, నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆమెను అరెస్ట్ చేసిన అనంతరం డైరెక్టరేట్ ఆఫ్ రెవె న్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఎస్) అధికారులు లావెల్లె రోడ్లోని ఆమె ఇంటిలో సోదాలు నిర్వహించగా 2.06 కోట్ల విలువైన బంగారు నగలు, 2.67 కోట్ల నగదు పట్టుబడ్డాయి. దీంతో పట్టుబడిన మొత్తం నగదు, బంగారం విలువ 17.29 కోట్లుగా అధికారులు నిర్ధారించారు. కర్ణాటక స్టేట్ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ డీజీపీ రామచంద్రరావు సవతి కుమార్తె అయిన రన్యారావు 15 రోజుల్లో నాలుగుసార్లు దుబాయ్ వెళ్లింది. ప్రతిసారీ ఆమె ఒకేరకమైన దుస్తులు ధరించేది. దీనిపై అధికారులు ఆరా తీస్తున్నారు. రన్యారావు ను ఆర్థిక నేరాల న్యాయస్థానంలో హాజరుపర్చ గా 14 రోజుల రిమాండ్ విధించారు.