Thai Cargo Ship : ఇండియాలోని గుజరాత్‌కు వస్తున్న థాయ్ కార్గో షిప్‌పై హోర్ముజ్ జలసంధి వద్ద బుధవారం దాడి జరిగింది. ఈ దాడి ఘటనలో షిప్పులోని కొందరు సిబ్బందిని ఒమన్ నావికా దళం రక్షించింది. మరికొందరు ఇంకా షిప్పులోనే ఉన్నారు. స్పష్టమైన సమాచారం లేనప్పటికీ ఈ నౌక థాయ్‌లాండ్ నుంచి ఇండియా వస్తున్నట్లు తెలుస్తోంది.
థాయ్‌లాండ్‌లోని ప్రీసియ్ షిప్పింగ్ సంస్థకు చెందిన మయూరీ నారీ అనే నౌక ఇండియాలోని గుజరాత్‌లోని కండ్ల పోర్ట్‌కు బయల్దేరింది. ఈ క్రమంలో ఒమన్ ఉత్తర తీరానికి 11 నాటికల్ మైళ్ల దూరంలో, హోర్ముజ్ జలసంధి వద్ద గుర్తు తెలియని వస్తువు ఏదో నౌకపై దాడి చేసింది. అది వాటర్ మైన్ అయ్యుంటుందని ప్రాథమిక అంచనా. ఈ మైన్ దాడిలో నౌక ప్రమాదానికి గురైంది. నౌకకు మంటలు అంటుకుని, భారీగా పొగ వ్యాపించింది. దీంతో నౌక నుంచి ఎమర్జెన్సీ సమాచారం అందుకున్న ఒనమ్ నేవీ సహాయక చర్యలు ప్రారంభించింది. ఘటనా స్థలానికి చేరుకుని నౌకలోని 20 మందిని రక్షించింది. ఇంకా ముగ్గురు సిబ్బంది నౌకలోనే ఉన్నట్లు తెలుస్తోంది.
వారిని రక్షించేందుకు కూడా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. నౌకలోని మంటలను సహాయక సిబ్బంది ఆర్పేసి, అదుపులోకి తెచ్చారు. ఈ విషయంపై ద రాయల్ థాయ్ నేవీ, యూకే మారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్ కూడా ప్రకటన చేశాయి. ఘటనలో ఎవరికైనా గాయాలయ్యాయా.. లేదా అనే విషయంలో క్లారిటీ లేదు. ఈ దాడి తామే చేశామంటూ కూడా ఏ సంస్థ లేదా దేశం ఇంకా ప్రకటించలేదు. దీనిపై విచారణ జరుగుతోంది.