PM Modi | జమ్ము కశ్మీర్‌లోని పెహల్గామ్ ఉగ్రదాడి (Pahalgam attack)తో దేశం ఉలిక్కిపడింది. ఈ పాశవిక దాడిలో 26 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడితో భారత్ – పాక్ మధ్య ఉద్రిక్తతలు నెలకొన్నాయి. సరిహద్దుల్లో పాక్ సైన్యం కాల్పుల ఉల్లంఘనకు పాల్పడుతోంది. ఈ పరిణామాల నేపథ్యంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) తో కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ (Rajnath Singh), జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ (Ajit Doval) సమావేశమయ్యారు.
ఉదయం 11 గంటలకు ప్రధాని నివాసానికి చేరుకున్న వీరు.. మోదీతో భేటీ అయ్యారు. ఉగ్రదాడి అనంతరం భద్రతా దళాలు తీసుకుంటున్న చర్యలను మోదీకి వివరించనున్నట్లు తెలుస్తోంది. ఇక చీఫ్ ఆఫ్ డిఫెన్స్ అనిల్ చౌహాన్ (Anil Chauhan)తో రాజ్‌నాథ్ ఆదివారం సమావేశమైన విషయం తెలిసిందే. ఆ సమావేశంలో తీసుకున్న కీలక నిర్ణయాలను ప్రధానికి వివరించనున్నారు. అంతేకాదు, తదుపరి చర్యలపై కూడా మోదీతో చర్చించనున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.
మరోవైపు నియంత్రణ రేఖ వెంబడి పాక్ రెచ్చగొట్టే చర్యలు కొనసాగుతున్నాయి. ఈ నెల 22న పహల్గాంలో పర్యాటకులపై ఉగ్రదాడి అనంతరం ఇరు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు ఏర్పడిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ పాక్ సైన్యం నియంత్రణ రేఖ వెంబడి కాల్పులు జరుపుతున్నది. తాజాగా కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి వరుసగా నాలుగో రోజూ పాకిస్థాన్ సైన్యం కాల్పులకు తెగబడింది. జమ్ముకశ్మీర్‌లోని కుప్వారా, పూంచ్ జిల్లాల్లో నియంత్రణ రేఖ (LOC) వెంబడి మరోసారి తుపాకులతో కవ్వింపులకు పాల్పడింది. అయితే పాక్ దుశ్చర్యను భారత్ ఆర్మీ సమర్థంగా తిప్పికొట్టింది.
‘ఆదివారం అర్ధరాత్రి వేళ కుప్వారా జిల్లాలోని కేరన్ సెక్టార్లో, పూంచ్ జిల్లాలోని కృష్ణఘాటి సెక్టార్లో నియంత్రణ రేఖ వెంబడి పాక్ సైన్యం కాల్పులకు పాల్పడింది. వీటికి భద్రతా బలగాలు తక్షణమే స్పందించి దాడులను తిప్పికొట్టాయి. రాత్రి సమయంలో భారత సైనిక పోస్టులను లక్ష్యంగా చేసుకుని చిన్న ఆయుధాలతో పాటు ఆటోమేటిక్ రైఫిల్స్ కాల్పులు జరిపింది’ అని భారత సైన్యం వెల్లడించింది. పూంచ్ సెక్టార్లో పాక్ ఆర్మీ కాల్పుల విరమణను ఉల్లంఘించడం ఈ మధ్యకాలంలో ఇదే మొదటిసారని అధికారులు తెలిపారు.
Also Read..
YouTube channels | పాకిస్థాన్ యూట్యూబ్ ఛానళ్లపై కేంద్రం నిషేధం.. బీబీసీకి నోటీసులు
India Pakistan | పూంచ్ సెక్టార్లో పాక్ కాల్పులు.. తిప్పికొట్టిన భారత్
Pahalgam Attack | 22 గంటలు ట్రెక్కింగ్ చేసి.. కోకెర్నాగ్ అడవుల నుంచి పహల్గాంకు ముష్కరులు!