శ్రీనగర్: సరిహద్దుల్లో పాక్ రెచ్చగొట్టే చర్యలు (India Pakistan) కొనసాగుతూనే ఉన్నాయి. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి వరుసగా నాలుగో రోజూ పాకిస్థాన్ సైన్యం కాల్పులకు తెగబడింది. జమ్ముకశ్మీర్‌లోని కుప్వారా, పూంచ్ జిల్లాల్లో నియంత్రణ రేఖ (LOC) వెంబడి మరోసారి తుపాకులతో కవ్వింపులకు పాల్పడింది. అయితే పాక్ దుశ్చర్యను భారత్ ఆర్మీ సమర్థంగా తిప్పికొట్టింది. ‘ఆదివారం అర్ధరాత్రి వేళ కుప్వారా జిల్లాలోని కేరన్ సెక్టార్లో, పూంచ్ జిల్లాలోని కృష్ణఘాటి సెక్టార్లో నియంత్రణ రేఖ వెంబడి పాక్ సైన్యం కాల్పులకు పాల్పడింది. వీటికి భద్రతా బలగాలు తక్షణమే స్పందించి దాడులను తిప్పికొట్టాయి. రాత్రి సమయంలో భారత సైనిక పోస్టులను లక్ష్యంగా చేసుకుని చిన్న ఆయుధాలతో పాటు ఆటోమేటిక్ రైఫిల్స్ కాల్పులు జరిపింది.’ అని భారత సైన్యం వెల్లడించింది.
ఈ నెల 22న పహల్గాంలో పర్యాటకులపై ఉగ్రదాడి అనంతరం ఇరు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు ఏర్పడిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ పాక్ సైన్యం నియంత్రణ రేఖ వెంబడి కాల్పులు జరుపుతున్నది. అయితే పూంచ్ సెక్టార్లో పాక్ ఆర్మీ కాల్పుల విరమణను ఉల్లంఘించడం ఈ మధ్యకాలంలో ఇదే మొదటిసారని అధికారులు తెలిపారు.
దేశాన్ని వీడిన 537 మంది పాక్ పౌరులు..
పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్థాన్ పౌరులు దేశం విడిచి వెళ్లిపోవాలంటూ భారత్ విధించిన డెడ్‌లైన్ ఆదివారంతో (మెడికల్ వీసా వారికి 29 వరకు) ముగిసింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు మూడు రోజుల వ్యవధిలో 537 మంది పాక్ పౌరులు, దౌత్యవేత్తలు అటారీ-వాఘా సరిహద్దు వెంబడి దేశాన్ని వదిలి పాక్‌కు తిరిగి వెళ్లిపోయారు. ఈ సందర్భంగా అమృత్‌సర్‌లోని ఈ అంతర్జాతీయ సరిహద్దు వద్ద ఆదివారం పెద్దయెత్తున వాహనాలు బారులుతీరాయి. చాలామంది భారతీయులు దేశం విడిచివెళ్తున్న తమ బంధువులకు వీడ్కోలు పలకడానికి అక్కడికి వచ్చారు. ఈ సందర్భంగా అక్కడ ఉద్విగ్న వాతావరణం ఏర్పడింది. 12 క్యాటగిరీల కింద స్వల్ప కాల వ్యవధి వీసాదారులు ఈ నెల 27లోగా దేశం వదిలి వెళ్లిపోవాలని భారత్ ఆదేశించింది. సార్క్ వీసా కలిగి ఉన్న వారికి ఏప్రిల్ 26, మెడికల్ వీసాలు ఉన్న వారికి ఏప్రిల్ 29 డెడ్‌లైన్‌గా విధించిన విషయం తెలిసిందే. అదేవిధంగా భారత్‌కు చెందిన 14 మంది దౌత్యవేత్తలు సహా 850 మంది ఈ అంతర్జాతీయ సరిహద్దు గుండానే భారత్‌కు చేరుకున్నారు.
తెలంగాణలో 208 మంది పాకిస్థానీయులు
తెలంగాణలో అధికారిక రికార్డుల ప్రకారం 208 మంది పాకిస్థాన్ పౌరులున్నారని పోలీస్ చీఫ్ జితేందర్ తెలిపారు. వీరిలో చాలామంది హైదరాబాద్‌లోనే ఉన్నారన్నారు. వీరిలో 156 మందికి దీర్ఘకాలిక వీసాలు, 13 మందికి స్వల్పకాలిక, 39 మంది పర్యాటక, వైద్య, వ్యాపార వీసాలపై వచ్చారన్నారు.