Pahalgam Attack | న్యూఢిల్లీ : పహల్గాం ఉగ్రదాడికి సంబంధించి కీలక విషయం వెలుగులోకి వచ్చింది. ముష్కరులు పహల్గాం చేరుకునేందుకు దాదాపు 22 గంటలపాటు ట్రెక్కింగ్ చేసినట్టు దర్యాప్తులో తేలిందని అధికార వర్గాలు వెల్లడించాయి. తమ ప్రణాళికను అమలుచేసేందుకు ఉగ్రవాదులు కష్టతరమైన కొకెర్నాగ్ అడవుల గుండా బైసరన్ లోయకు కాలినడకన చేరుకున్నట్టు తెలిసింది. ఈ దాడిలో ముగ్గురు పాక్ టెర్రరిస్టులు, ఒక స్థానిక ఉగ్రవాది (ఆదిల్ థోకర్) పాల్గొన్నారని భద్రతా వర్గాలు తెలిపాయి. ఉగ్రవాదులు ఏకే-47, ఎం2 అసాల్ట్ రైఫిల్స్‌తో పర్యాటకులను కాల్చి చంపారని ఘటనా స్థలిలో దొరికిన తూటాల ఆధారంగా నిర్ధారించారు. ఇద్దరు ఉగ్రవాదులు దుకాణాల వెనుక నుంచి కల్మా పఠించాలని పర్యాటకులను ఆదేశించి.. పఠించని వారిని కాల్చి చంపారు. మరో ఇద్దరు టెర్రరిస్టులు జిప్‌లైన్ వద్ద నిలబడి టూరిస్టులపై కాల్పులకు తెగబడ్డారు. దాడి చేశాక ఒక పర్యాటకుడు, ఒక స్థానికుడి మొబైల్ ఫోన్లను ఉగ్రవాదులు స్వాధీనం చేసుకున్నారు.
ఈ ఉగ్ర దాడికి సంబంధించి స్థానిక ఫొటోగ్రాఫర్ రికార్డ్ చేసిన ఫుటేజీ దర్యాప్తులో కీలకంగా మారింది. దాడి జరిగినప్పుడు అతడు అక్కడే ఉన్న ఒక చెట్టు పైకి ఎక్కి కాల్పుల ఘటనను వీడియో తీశారు. ఇప్పుడు ఈ వీడియో దర్యాప్తులో కీలకంగా మారింది. అదే రోజు బైసరన్ లోయలో విహార యాత్రకు వచ్చిన లెఫ్టినెంట్ కర్నల్ ఇచ్చిన సాక్ష్యం కూడా దర్యాప్తుకు బాగా ఉపయోగపడనుంది. మరోవైపు జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) పహల్గాం ఉగ్రదాడి దర్యాప్తును తన చేతుల్లోకి తీసుకుంది. ఆ సంస్థ ఉగ్రవాద నిరోధక బృందాలు ఈ నెల 23 నుంచి ఘటనా స్థలిలో మకాం వేసి ఆధారాలను సేకరించాయి. ప్రత్యక్ష సాక్షులను ప్రశ్నించి ఘటన జరిగిన తీరుని క్షుణ్ణంగా తెలుసుకున్నాయి. సీన్ రీ కన్స్ట్రక్షన్ చేసి ఘటన జరిగిన తీరును పరిశీలించాయి. ఫోరెన్సిక్ నిపుణుల సాయంతో ప్రతి ఆధారాన్ని సేకరించాయి.
జమ్ముకశ్మీర్‌లోని నియంత్రణ రేఖ (ఎల్వోసీ) వెంబడి పాకిస్థాన్ వరుసగా మూడో రోజు కూడా కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. అయితే పాకిస్థాన్ కాల్పులను భారత సైనికులు సమర్థంగా తిప్పికొట్టినట్టు ఆదివారం అధికారులు తెలిపారు. వరుసగా మూడో రోజు రాత్రి కూడా పాక్ సైనికులు భారత్‌ను రెచ్చగొట్టేలా కాల్పులు జరిపారని చెప్పారు. ఈ కాల్పుల్లో ఎవరూ గాయపడలేదని పేర్కొన్నారు.
ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడినట్టు భావిస్తున్న ముగ్గురి ఇళ్లను బందిపొర, పుల్వామా, షోపియాన్ జిల్లాల్లో ధ్వంసం చేశారు. పహల్గాం దాడి తర్వాత భద్రతా దళాలు ఉగ్రవాదులపై అణచివేతను కొనసాగించాయి. ఇప్పటివరకు అధికారులు అనుమానిత ఉగ్రవాదులకు చెందిన తొమ్మిది ఇండ్లను నేలమట్టం చేశారు. పహల్గాం ఉదంతం తర్వాత భద్రతా దళాలు కశ్మీర్ లోయలో ఐదు రోజుల వ్యవధిలో 500కు పైగా ప్రాంతాల్లో దాడులు చేసి వందలాది మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నాయి.
పాకిస్థాన్‌కు బందీగా చిక్కిన భారత జవాన్ విడుదలపై 90 గంటలు దాటినా అదే ప్రతిష్టంభన కొనసాగుతున్నది. పంజాబ్‌లోని ఫిరోజ్‌పూర్ వద్ద అంతర్జాతీయ సరిహద్దు వద్ద పశ్చిమ బెంగాల్‌కు చెందిన బీఎస్ఎఫ్ కానిస్టేబుల్ పూర్ణం కుమార్ సాహు పొరపాటున బుధవారం పాకిస్థాన్ భూభాగంలోకి వెళ్లడంతో అతడిని పాక్ రేంజర్లు అదుపులోకి తీసుకున్నారు. అతని విడుదల కోసం పాకిస్థాన్ రేంజర్లతో బీఎస్ఎఫ్ అధికారులు మూడుసార్లు ఫ్లాగ్ మీటింగ్‌లు జరిపారు. అయితే అతడిని అప్పగించడానికి పాక్ తిరస్కరించింది. ఈసారి ఫీల్డ్ కమాండర్ స్థాయిలో ఫ్లాగ్ మీటింగ్ జరపాలని భారత్ నిర్ణయించింది. త్వరలోనే ఈ సమావేశం జరుగుతుందని తెలిపింది.