Operation Sindoor | జమ్ము కశ్మీర్‌లోని పహల్గాంలో పర్యాటకులపై దాడికి పాల్పడి 26 మంది అమాయకుల ప్రాణాలు తీసిన ఉగ్రవాదులపై భారత్ ప్రతీకారం తీర్చుకున్నది. ఆ ఉగ్రమూకలను పెంచి పోషిస్తున్న పాకిస్థాన్‌పై మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. ‘ఆపరేషన్ సిందూర్’ (Operation Sindoor) పేరుతో ప్రతిదాడికి దిగి పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే)తోపాటు పాకిస్థాన్‌లోని మూడు ప్రధాన ఉగ్రవాద సంస్థలు జైషే మహ్మద్, లష్కరే తాయిబా, హిజ్బుల్ ముజాహిదీన్లకు చెందిన 9 ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేసింది. భారత్ జరిపిన ఈ దాడిలో 80 మంది వరకూ ఉగ్రవాదులు ప్రాణాలు కోల్పోయినట్లు వార్తలు వచ్చాయి.
భారత్ దాడితో రగిలిపోతున్న పాక్.. ప్రతిచర్యగా భారత్‌పై ఏక్షణమైనా దాడులు చేసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో భారత్ అప్రమత్తమైంది. సరిహద్దు రాష్ట్రాల్లో భద్రతను కట్టుదిట్టం చేసింది. ముఖ్యంగా రాజస్థాన్ (Rajasthan), పంజాబ్ (Punjab) రాష్ట్రాల్లో హై అలర్ట్ ప్రకటించింది. రెండు రాష్ట్ర ప్రభుత్వాలు పోలీసు సిబ్బంది సెలవులను రద్దు చేశాయి. అంతేకాదు బహిరంగ సభలపై కూడా నిషేధం విధించాయి. పాక్‌తో రెండు రాష్ట్రాల సరిహద్దులను పూర్తిగా మూసివేశారు. సరిహద్దు వద్ద ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే కాల్పులు జరిపేలా భద్రతా దళాలకు ఆదేశాలు జారీ అయ్యాయి.
మరోవైపు భారత వైమానిక దళం కూడా హై అలర్ట్ అయ్యింది. పశ్చిమ సెక్టార్లో ఫైటర్ జెట్లు గస్తీ కాస్తున్నాయి. సుఖోయ్-30 MKI జెట్లు గంగానగర్ నుండి రాన్ ఆఫ్ కచ్ వరకు వైమానిక గస్తీ నిర్వహిస్తున్నాయి. ఈ ఉద్రిక్తతల నేపథ్యలో జోధ్‌పూర్, కిషన్‌గఢ్, బికనీర్ విమానాశ్రయాలను అధికారులు మూసివేశారు. బికనీర్, గంగానగర్, జైసల్మేర్, బార్మెర్ జిల్లాల్లోని పాఠశాలలను అధికారులు మూసివేశారు. ప్రస్తుతం జరుగుతున్న పరీక్షలను కూడా వాయిదా వేశారు. పోలీసు, రైల్వే సిబ్బందికి సెలవులు రద్దు చేశారు. ఇప్పటికే సెలవుల్లో ఉన్న అధికారులు వెంటనే విధుల్లోకి చేరాలని ఆదేశాలు జారీ అయ్యాయి. మరోవైపు ఏక్షణమైనా పాక్ దాడికి పాల్పడొచ్చన్న అనుమానంతో సరిహద్దు గ్రామాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. అత్యవసర సమయంలో వారందరినీ సురక్షిత ప్రాంతాలకు తరలించేలా ఏర్పాట్లు చేశారు.
Also Read..
Ceasefire | నియంత్రణరేఖ వద్ద పాక్ దుశ్చర్య.. జవాను సహా 13 మంది మృతి
Chopper Crashes | ఉత్తరాఖండ్‌లో ఘోర ప్రమాదం.. హెలికాప్టర్ కూలి ఐదుగురు మృతి
Ceasefire | సరిహద్దుల్లో పాక్ సైన్యం దుశ్చర్య.. కాల్పులను తిప్పికొట్టిన భారత సైన్యం..