Ceasefire | పెహల్గామ్ ఉగ్రదాడికి భారత్ గట్టిగా బదులిచ్చినా పాక్ బుద్ధి మారడం లేదు. నియంత్రణ రేఖ వెంట (Line of Control) సరిహద్దులు దాటి కాల్పుల ఉల్లంఘనకు పాల్పుడుతూనే ఉంది. వరుసగా 14వ రోజు గురువారం కూడా దాయాది సైన్యం కవ్వింపులు కొనసాగాయి. కుప్వారా, బారాముల్లా, ఉరి, అఖ్నూర్ సెక్టార్లలోని సరిహద్దు గ్రామాలపై పాక్ బలగాలు మోర్టార్ షెల్లింగ్, ఫైరింగ్‌కు పాల్పడుతున్నాయి. ఈ కాల్పులను సమర్థవంతంగా తిప్పికొడుతున్నట్లు సైన్యం ప్రకటించింది.
బుధవారం అర్ధరాత్రి శత్రు సైన్యం జరిపిన కాల్పుల్లో ఓ జవాను (Soldier) మృతి చెందారు. పాక్ షెల్లింగ్‌లో గాయపడి 5వ ఫీల్డ్ రెజిమెంట్‌కు చెందిన లాన్స్ నాయక్ దినేశ్‌కుమార్ అమరుడైనట్లు వైట్ నైట్ కోర్ గురువారం ధ్రువీకరించింది. ఇక మంగళవారం అర్ధరాత్రి నుంచి పాక్ బలగాలు జరిపిన కాల్పుల్లో జవాను సహా మొత్తం 13 మంది భారత పౌరులు (Civilians Killed) మృతిచెందగా.. 57 మంది గాయపడినట్లు సైన్యం వెల్లడించింది. మరణించిన వారిలో నలుగురు చిన్నారులున్నారు.
ఫిబ్రవరి 25, 2021న భారతదేశం-పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. అయినా తరుచూ పాకిస్తాన్ కాల్పుల విరమణను ఉల్లంఘిస్తూ వస్తున్నది. కాల్పుల విరమణకు ముందు 2018 సంవత్సరంలో భారీ నష్టం జరిగింది. సరిహద్దు ప్రాంతాల్లో పాకిస్తాన్ జరిపిన షెల్లింగ్‌లో 30 మంది పౌరులు మరణించారు. 2019లో 18 మంది పౌరులు, 2020లో 15 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు. పాకిస్తాన్ కాల్పుల నేపథ్యంలో స్థానిక ప్రభుత్వం పరిస్థితిని ఎదుర్కోవడానికి పూర్తిగా సిద్ధంగా ఉంది. సున్నితమైన ప్రాంతాల నుంచి ప్రజలను సురక్షితమైన ప్రదేశాలకు తరలించి, బోర్డింగ్, వసతి, ఆహారం, వైద్యం, రవాణాను నిర్ధారించాలని జిల్లా డిప్యూటీ కమిషనర్లకు ఆదేశాలు జారీ అయ్యాయి.
Also Read..
Chopper Crashes | ఉత్తరాఖండ్‌లో ఘోర ప్రమాదం.. హెలికాప్టర్ కూలి ఐదుగురు మృతి
All Party Meeting | నేడు అఖిలపక్ష సమావేశం.. ‘ఆపరేషన్ సిందూర్’పై వివరించనున్న కేంద్రం..!