All Party Meeting | ఆపరేషన్ సిందూర్ చేపట్టి భారత సైన్యం కేవలం 25 నిమిషాల్లోనే తొమ్మిది ఉగ్రస్థావరాలపై మిస్సైల్స్తో కురిపించింది. లష్కరే తోయిబా, జైషే మహ్మద్ ప్రధాన కార్యాలయాలు సహా తొమ్మిది ఉగ్రవాద శిక్షణా కేంద్రాలను నేలమట్టం చేసింది. ఈ దాడి తర్వాత కేంద్ర ప్రభుత్వం గురువారం ఉదయం 11 గంటలకు అఖిలపక్ష సమావేశం నిర్వహించింది. సమావేశానికి రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన జరుగనున్నది. హోంమంట్రి అమిత్ షా, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు సైతం సమావేశానికి హాజరుకానున్నారు. ఈ సమావేశంలో ప్రతిపక్ష పార్టీల నేతలకు భారత్ ఎందుకు ప్రతీకార దాడులు చేయాల్సి వచ్చింది.. భవిష్యత్ సన్నాహాలపై కేంద్రం వివరాలను తెలియజేయనున్నది.
అయితే, ఏప్రిల్ 24న జరిగిన అఖిలపక్ష సమావేశానికి హాజరుకావాలని ప్రధానమంత్రిని డిమాండ్ చేశామని.. కానీ ఆయన రాలేదని కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ అన్నారు. ఈసారైనా ప్రధాని రావాలని ఆయన కోరారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారతదేశ జాతీయ విధానం స్పష్టంగా, బలంగా ఉందన్నారు. రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున్ ఖర్గే, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అఖిలపక్ష సమావేశానికి హాజరవుతారని తెలిపింది. ఇదిలా ఉండగా.. ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ మూడుదేశాల పర్యటనను రద్దు చేసుకున్నారు. మే 13 నుంచి 17 వరకు నార్వే, క్రొయేషియా, నెదర్లాండ్స్లో పర్యటించాల్సి ఉంది. ఆపరేషన్ సిందూర్ తర్వాత ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది నియంత్రణ రేఖ వెంబడి పాకిస్తాన్ సైన్యం కార్యకలాపాలకు సంబంధించి స్థానిక దళాలతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నారు.
పాకిస్తాన్, పీవోకే, జమ్మూ కశ్మీర్ (PoJK)లోని ఉగ్రవాద శిబిరాలపై ఖచ్చితమైన దాడుల తర్వాత, పాకిస్తాన్ కాల్పుల విరమణ ఒప్పందానికి విరుద్ధంగా చేస్తున్న దాడులను నిశితంగా పరిశీలిస్తున్నారు. పాక్ చేసే ఏ దుస్సాహసాన్నైనా ఎదుర్కొనేందుకు సైన్యం, భద్రతా బలగాలు అప్రమత్తంగా ఉన్నాయని రక్షణ అధికారులు బుధవారం ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత కొద్ది గంటల్లోనే ఈ నెల 6-7 తేదీల మధ్య రాత్రి 1.05 గంటల నుంచి 1.30 గంటల వరకు త్రివిధ దళాలు సంయుక్తంగా ఆపరేషన్ సిందర్ని నిర్వహించారు. ఈ 25 నిమిషాల ఆపరేషన్లో 24 క్షిపణుల సహాయంతో తొమ్మిది ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేశాయి. ఈ తొమ్మిది స్థావరాలలో ఐదు పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో ఉండగా, నాలుగు పాకిస్తాన్లో ఉన్నాయి. ఇక్కడే ఉగ్రవాదులకు శిక్షణ ఇస్తున్నట్లుగా విదేశాంగశాఖ ప్రకటించింది. దాడుల్లో ఉగ్రవాది మసూద్ అజర్ కుటుంబానికి చెందిన పది మందితో పాటు సన్నిహితులు సైతం మృతి చెందారు.