Defense | పాకిస్తాన్ కాల్పుల విరమణ ఒప్పందానికి విరుద్ధంగా సరిహద్దుల్లో పెద్ద ఎత్తున దాడులు చేస్తుండగా.. భారత సైన్యం నిశితంగా గమనిస్తోంది. ఆర్మీ చీఫ్ స్థానిక ఆర్మీ యూనిట్లతో నిరంతరం సంప్రదింపులు జరుపుతూ పాకిస్తాన్ సైన్యం కార్యకలాపాలను పర్యవేక్షిస్తున్నారు. నియంత్రణ రేఖ వద్ద భారత పౌరులను లక్ష్యంగా చేసుకుని పాకిస్తాన్ సైన్యం జరుపుతున్న కాల్పులకు తిరిగి సమాధానం ఇచ్చేందుకు భారత సైన్యానికి స్వేచ్ఛ ఇచ్చినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.
పాకిస్తాన్, పీవోకేలోన ఉగ్రవాద శిబిరాలపై భారత సైన్యం క్షిపణి దాడులు చేసినప్పటి నుంచే పాకిస్తాన్ సరిహద్దుల వెంట ఈ దుశ్చర్యకు పాల్పడుతున్నది. త్రివిధ దళాల సంయుక్త ఆపరేషన్లో మొత్తం తొమ్మిది ఉగ్రవాద స్థావరాలే లక్ష్యంగా దాడికి పాల్పడ్డాయి. పహల్గాం ఉగ్రవాద దాడికి భారత దళాల నుంచి ఊహించని విధంగా బదులివ్వడంతో.. పాకిస్తాన్ సైన్యం, మంగళవారం రాత్రి అంతా పూంచ్, బారాముల్లా, రాజోరి జిల్లాల్లోని నియంత్రణ రేఖ (LOC) సమీపంలోని గ్రామాలపై పెద్ద ఎత్తున కాల్పులు జరిపింది. పాక్ కాల్పుల్లో నలుగురు పిల్లలు సహా 15 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు. మరో 57 మంది గాయపడ్డారు.
ఇందులో 12 మంది మృతులను గుర్తించారు. పాక్ రేంజర్లు దుశ్చర్యకు భారత ఆర్మీ సైతం గట్టి సమాధానం ఇచ్చింది. భారత జరిపిన కాల్పుల్లో పాకిస్తాన్ సైనికులు పెద్ద ఎత్తున చనిపోయారని సమాచారం. డజన్ల కొద్దీ పోస్టులు ధ్వంసమయ్యాయి. ఈ ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో జమ్మూ డివిజన్లోని ఐదు జిల్లాలు, కశ్మీర్ డివిజన్లోని మూడు జిల్లాల్లో పాఠశాలలను మూసివేశారు. ముందు జాగ్రత్త చర్యగా జమ్మూ, శ్రీనగర్, లేహ్ నుంచి విమాన సర్వీసులను నిలిపివేశారు. కథువాలో హెలికాప్టర్ సేవలను సైతం నిలిపివేశారు. అన్ని ప్రభుత్వ విభాగాల్లో అధికారులు, సిబ్బంది ఉద్యోగుల సెలవులు రద్దు చేశారు.