TGSRTC | హైదరాబాద్, మార్చి 6 (నమస్తే తెలంగాణ): ‘మీకు పదేండ్లు.. 20 ఏండ్ల అనుభవం ఉన్నా.. మాకు అక్కర్లేదు. కేవలం 18 నెలల అనుభవం ఉంటే చాలు.. తెలంగాణ ఆర్టీసీలో ఎలక్ట్రిక్ బస్‌లు నడిపేందుకు డ్రైవర్ల కోసం దరఖాస్తు చేసుకోండి’ అంటూ ప్రైవేట్ కంపెనీలు ఓవైపు విస్తృతంగా ప్రచారం చేస్తుంటే.. మరోవైపు ‘ఆర్టీసీలో డ్రైవర్లకు, మెకానిక్‌లకు మనుగడ కష్టంగానే ఉంది. మీకు ఆర్టీసీలో ఉద్యోగమే కావాలంటే కండక్టర్లుగా వెళ్లొచ్చు’ అంటూ యాజమాన్యం, ప్రభుత్వం సలహాలిస్తున్నాయి. తెలంగాణ రోడ్లపై కొన్నేండ్లపాటు బస్సులు నడిపిన ఆర్టీసీ డ్రైవర్లను.. ఎలక్ట్రిక్ బస్‌ల ప్రవేశంతో వేలల్లో రోడ్డున పడేసేందుకు ప్రభుత్వం సిద్ధపడుతున్నది. అనుభవంలేని డ్రైవర్ల కోసం ప్రైవేట్ ఆపరేటర్లు వేట కొనసాగిస్తుండగా..ఆర్టీసీ డ్రైవర్లను వారికి కనెక్ట్ చేయడంలో అటు సంస్థ.. ఇటు ప్రభుత్వం ఘోరంగా విఫలమవుతున్నాయి. కేవలం బస్సులను తిప్పుతూ ఆర్టీసీ ఆస్తులు, బస్స్టాండ్లు, స్థలాలను కబ్జాపెట్టేందుకు ప్రైవేట్ ఎలక్ట్రిక్ బస్సుల యాజమాన్యాలు సిద్ధమవుతున్నాయి.
ఎలక్ట్రిక్ బస్‌లతో ఆర్టీసీ మనుగడ, కార్మికుల ఉద్యోగాలు ప్రమాదంలో పడే అవకాశం ఉంది. ఎలక్ట్రిక్ బస్‌ల సంస్థ ఒలెక్ట్రా కంపెనీకి ఆర్టీసీ యాజమాన్యానికి మధ్య 1085 ఎలక్ట్రిక్ బస్‌ల కోసం లెటర్ ఆఫ్ ఇంటెంట్ (దీని విలువ రూ.1,800 కోట్లు) ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం ప్రకారం 20 నెలల్లో ఒలెక్ట్రా కంపెనీ బస్‌లను అందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. అయితే, ఓ రీజియన్‌లో కేవలం 48 ఎలక్ట్రిక్ బస్లకే 60 మంది మెకానిక్‌లు అదనపు సిబ్బందిగా తేలారు. ఇక 1,080 ఎలక్ట్రిక్ బస్‌లు వస్తే మెకానిక్‌లు, డ్రైవర్లలో ఎంతమంది ఉద్యోగాలు కోల్పోతారో ఊహించుకోవచ్చు. ఇది చాలదన్నట్లు ఎలక్ట్రిక్ బస్‌ల కోసం ఇప్పటికే విద్యుత్తు సబ్స్టేషన్ల ఏర్పాటు, మౌలిక వసతుల కల్పన పేరుతో ఆర్టీసీకి ఉన్న భూములను ప్రైవేట్ సంస్థలకు అప్పగిస్తున్నారు. ప్రస్తుతం ఏపీఎస్ఆర్టీసీలో 1800 ఎకరాలు, టీజీఎస్ఆర్టీసీలో 1429 ఎకరాల భూమి ఉంది. ఈ భూమి ప్రైవేట్ కంపెనీల చేతుల్లోకి వెళ్తే.. భవిష్యత్ అవసరాల కోసం ఆర్టీసీని విస్తరించడం, కొత్త డిపోలను ఏర్పాటు చేయడం సాధ్యం కాదని కార్మిక నేతలు అంటున్నారు.
ఆర్టీసీలోకి ఎలక్ట్రిక్ బస్‌ల రాకతో సుమారు 10వేల మంది డ్రైవర్లు, మెకానిక్లపై ప్రత్యక్షంగా ప్రభావం పడుతుందని కార్మిక సంఘాల నేతలు చెప్తున్నారు. ఈ క్రమంలో ఏదో కొంతమంది కార్మికులను సర్దుబాటు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. అయినా కూడా సుమారు 70 శాతం మంది ఆర్టీసీ కార్మికులు ఉద్యోగాలు కోల్పోవలసి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఉన్నతాధికారుల ఆదేశాలతో కిందిస్థాయి అధికారులు ఆర్టీసీ డ్రైవర్ల పట్ల కఠినంగా వ్యవహరిస్తున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆర్టీసీలో ఉండాలంటే కండక్టర్‌గా, మెకానిక్‌లుగా మారేందుకు అవకాశం కల్పిస్తున్నామని మౌఖికంగా చెప్తున్నారు. సున్నితంగా బెదిరిస్తూ.. డ్రైవర్ల చేతిలో నిర్దాక్షిణ్యంగా టిమ్ మెషీన్లు పెట్టి.. కండక్టర్లుగా పంపిస్తున్న ఘటనలు తెలంగాణ ఆర్టీసీలో చోటుచేసుకుంటున్నాయి. ఎవరైనా డ్రైవర్లు వారి ఆఫర్లకు లొంగకపోతే.. వారికి నచ్చిన జిల్లాలో, నచ్చిన రూట్లో కండక్టర్‌గా వెళ్లేందుకు అవకాశం కల్పిస్తామని హామీలు సైతం ఇస్తున్నారని తెలిసింది. మొత్తంగా ఎలక్ట్రిక్ బస్‌ల రాకతో ఆర్టీసీలో డ్రైవర్లు, మెకానిక్‌లకు కష్టకాలం వచ్చిందని చర్చించుకుంటున్నారు.
కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న ఎలక్ట్రిక్ బస్సుల విధానంలో మార్పులు చేసి, ఆర్టీసీలకే ఎలక్ట్రిక్ బస్‌లు ఇవ్వాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. వేల మంది ఉద్యోగులు రోడ్డున పడుతున్న తరుణంలో.. రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేయకపోవడం విడ్డూరంగా ఉన్నదని నేతలు మండిపడుతున్నారు. ఈ విషయంలో కేంద్రాన్ని ఒప్పించేందుకు ఎందుకు సుముఖత చూపడం లేదని ప్రశ్నిస్తున్నారు. కార్పొరేట్లకు ఇచ్చే సబ్సిడీలు ఆర్టీసీలకు ఇస్తే.. వారే నేరుగా ఎలక్ట్రిక్ బస్‌లను కొనుగోలు చేస్తారని, ఉద్యోగులెవ్వరినీ తీసేయాల్సిన అవసరం ఉండదని సూచిస్తున్నారు. ఆర్టీసీ ఉద్యోగులను కాపాడుకునేందుకు ఆ బస్సుల కొనుగోలుకు అవసరమైన నిధులను ప్రభుత్వమే సమకూర్చాల్సింది పోయి.. వారే కార్పొరేట్లకు వంతపాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం, ఆర్టీసీ యాజమాన్యం సరైన నిర్ణయం తీసుకోకపోతే ఆర్టీసీ పూర్తిగా ప్రైవేట్‌పరం అవుతుందని ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఈ బస్సుల విధానంలో మార్పులు చేయకపోతే ఆర్టీసీ మనుగడ కష్టమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.