హైదరాబాద్, మార్చి 6 (నమస్తే తెలంగాణ) : పదోతరగతి వార్షిక పరీక్షలు ఈ నెల 14 నుంచి ప్రారంభంకానున్నాయి. ఏప్రిల్ 16 వరకు జరుగుతాయి. ఈ సారి 5,17,727 మంది విద్యార్థులు పరీక్షలు రాయబోతున్నారు. వీరిలో 4,65,266 మంది ఇంగ్లిష్ మీడియం వారే. తెలుగు మీడియంలో పరీక్షలు రాసే విద్యార్థుల సంఖ్య కేవలం 44,881 మంది మాత్రమే. హిందీ మీడియంలో 170, ఉర్దూలో 7,230, కన్నడలో 85, మరాఠీ మీడియంలో 95 మంది చొప్పున పరీక్షలు రాయబోతున్నారు. 1,408 మంది ప్రత్యేక అవసరాలు గల వారు కూడా పరీక్షలు రాయబోతున్నారు. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు పరీక్షలు జరుగుతాయి. సైన్స్ పేపర్లకు మాత్రం ఉదయం 9:30 నుంచి 11 గంటల వరకు పరీక్షలుంటాయి. ఐదు నిమిషాల లేట్ ఎంట్రీని అనుమతిస్తారు. ఆ తర్వాత వచ్చే విద్యార్థులను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అనుమతించబోరు. పరీక్షలు రాసే విద్యార్థుల్లో స్ఫూర్తి నింపేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఈ నెల 9న టీ-శాట్ లో మోటివేషనల్ స్పీచ్ కార్యక్రమాన్ని ఏర్పాటుచేశారు. ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు విద్యాశాఖ కార్యదర్శి యోగితారాణా విద్యార్థుల్లో స్ఫూర్తి నింపుతారని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ తెలిపారు.