ఉరుకులు పరుగుల జీవితంలో చాలామంది చేసే అతిపెద్ద పొరపాటు బ్రేక్‌ఫాస్ట్ స్కిప్ చేయడం. రాత్రంతా ఖాళీ కడుపుతో ఉన్న మన శరీరానికి ఉదయం పూట సరైన పోషకాలు అందడం ఎంతో అవసరం. ముఖ్యంగా ప్రొటీన్ అధికంగా ఉండే అల్పాహారం తీసుకోవడం వల్ల కండరాల ఆరోగ్యం మెరుగుపడటమే కాకుండా, రోజంతా ఉత్సాహంగా పని చేయడానికి కావాల్సిన శక్తి లభిస్తుంది. కానీ, బ్రేక్‌ఫాస్ట్ తయారీకి టైమ్ వేస్ట్ అని చాలామంది బ్రంచ్‌కు మొగ్గు చూపుతున్నారు. కానీ, పదకొండు కొట్టే దాకా కడుపు మాడ్చుకోవం సరికాదని ఆహార నిపుణులు అంటున్నారు. అల్పాహారం తయారీకి సమయం వృథా అనే కదా మీ బాధ! ఈ వెరైటీలు ఫటాఫట్ చేసుకోవచ్చు. ప్రొటీన్ కంటెంట్ ఎక్కువగా ఉండే ఈ పదార్థాలను బ్రేక్‌ఫాస్ట్‌గా తీసుకుంటే.. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం.
పనీర్ బుర్జీ: పనీర్ ప్రొటీన్‌కు నిలయం. ఇది చాలా త్వరగా జీర్ణం కావడమే కాకుండా రుచిగా కూడా ఉంటుంది. ఒక కప్పు తురిమిన పనీర్, ఒక చిన్న టమాటా, పచ్చిమిర్చి, పసుపు, ఉప్పు, కొద్దిగా నూనె లేదా నెయ్యి సిద్ధం చేసుకోవాలి. పాన్‌లో కొద్దిగా నూనె వేసి పోపు దినుసులు వేసి, తర్వాత టమాటాలు వేసి మగ్గనివ్వాలి. అందులో పసుపు, పచ్చిమిర్చి వేసి, తురిమిన పనీర్, ఉప్పు కలపాలి. 3-4 నిమిషాల పాటు వేయిస్తే పనీర్ బుర్జీ సిద్ధమవుతుంది.
గ్రీక్ యోగర్ట్-నట్స్ బౌల్: వంట చేసే సమయం కూడా లేని వారికి ఇది బెస్ట్ ఆప్షన్. ఇది కేవలం ఐదు నిమిషాల్లోనే సిద్ధం చేసుకోవచ్చు. 1 కప్పు గ్రీక్ యోగర్ట్ (పెరుగు), బాదం పప్పులు, చియా విత్తనాలు, ఒక అరటిపండు, కొద్దిగా తేనె ఉంటే చాలు ఈ వెరైటీ రెడీ చేసుకోవచ్చు. ఒక గిన్నెలో పెరుగు తీసుకుని, పైన అరటిపండు ముకలు, బాదం, చియా విత్తనాలు వేసి చివర్లో కాస్త తేనే కలుపుకొంటే చాలు. చిటికెలో బ్రేక్‌ఫాస్ట్ సిద్ధంగా ఉంటుంది.
శనగపిండి అట్లు: శాకాహారులకు శనగపిండి ఒక అద్భుతమైన ప్రొటీన్ వనరు. ఒక కప్పు శనగ పిండి, సన్నగా తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, పసుపు, నీరు పక్కన పెట్టుకోండి. శనగపిండిని గంట జారుడుగా కలుపుకొని అందులో ఉల్లిపాయలు, మిర్చి, పసుపు మిక్స్ చేసకోండి. పెనంపై కొద్దిగా నూనె వేసి అట్లు పోసుకోవాలి. రెండు వైపులా ఎర్రగా కాల్చుకుంటే పోషకాలతో కూడిన బ్రేక్ ఫాస్ట్ రెడీ.
మొలకలు-ఉడికించిన గుడ్డు: ఒక కప్పు మొలకెత్తిన గింజలు, రెండు ఉడికించిన గుడ్లు, నిమ్మరసం, మిరియాల పొడి, ఉప్పుతో దీనిని చేసుకోవచ్చు. ఒక గిన్నెలో మొలకలు తీసుకుని, నిమ్మరసం, ఉప్పు, మిరియాల పొడి కలపాలి. పైన ఉడికించిన గుడ్డు ముకలను పెట్టుకుని తింటే చాలాసేపటి వరకు ఆకలి వేయదు.