ఒకప్పుడు విడాకులు అంటే.. రెండు
జీవితాలు విడిపోవడం మాత్రమే కాదు. ఒక ఇల్లు ముక్కలవ్వడం. పిల్లలు ఒక వారం తండ్రి దగ్గర, మరో వారం తల్లి దగ్గర.. బ్యాగులు సర్దుకుని రైలు పెట్టెల్లా తిరగాల్సి వచ్చేది. ఈ క్రమంలో వారు తమ స్నేహితులను, చదువును, ఆఖరికి తమకిష్టమైన గదిని కూడా కోల్పోయేవారు. కానీ, ఇప్పుడు ట్రెండ్ మారుతున్నది. ‘మేము విడిపోయాం.. కానీ మా పిల్లల ప్రపంచం విడిపోకూడదు’ అనుకుంటున్నారు తల్లిదండ్రులు. ఈ క్రమంలో ‘నెస్టింగ్’ అనే సరికొత్త దారిని ఎంచుకుంటున్నారు. పక్షులు తమ గూటిలో పిల్లలను ఉంచి, వంతుల వారీగా ఆహారం తెచ్చి పెట్టినట్టే.. ఇక్కడ ఇల్లు పిల్లలదే ఉంటుంది. తల్లిదండ్రులు మాత్రమే వంతుల వారీగా వచ్చి వెళ్తుంటారు. ఇది వినడానికి బాగున్నా.. భారతీయ సమాజంలోకి ఇప్పుడిప్పుడే ఇమిడేందుకు సిద్ధం అవుతున్నది.
ఈ కాన్సెప్ట్నే ‘బర్డ్స్ నెస్ట్ కస్టడీ’ అని కూడా పిలుస్తున్నారు. సాధారణ విడాకుల కేసుల్లో పిల్లలు ఇల్లు మారాలి. కానీ, నెస్టింగ్లో పిల్లలే యజమానులు. పిల్లలు తమ సొంత ఇంట్లోనే, తమ పాత గదిలోనే ఉంటారు. వారి స్కూల్, స్నేహితులు ఏమీ మారవు. పేరెంట్స్ రొటేషన్ ఉంటుంది. తల్లిదండ్రులు ఒక షెడ్యూల్ ప్రకారం ఆ ఇంటికి వస్తారు. ఉదాహరణకు, మూడు రోజులు తండ్రి ఆ ఇంట్లో ఉంటే, తల్లి వేరేచోట ఉంటుంది. ఆ తర్వాత తండ్రి వెళ్తాడు.. తల్లి వస్తుంది. దీంతో పిల్లలకు తమ జీవితం తలకిందులు కాలేదనే భరోసా ఉంటుంది. మానసిక ఆందోళన కూడా తగ్గుతుంది.
మన దేశంలో విడాకులు అంటే కేవలం ఇద్దరు వ్యక్తుల మధ్య గొడవ కాదు.. రెండు కుటుంబాల మధ్య యుద్ధం. ఇలాంటి పరిస్థితుల్లో నెస్టింగ్ ఎంతవరకు వర్కవుట్ అవుతుందనే దానిపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఈ క్రమంలో మ్యూచువల్ ట్రస్ట్ అనివార్యం అంటున్నారు నిపుణులు. నెస్టింగ్ సక్సెస్ అవ్వాలంటే మాజీ దంపతుల మధ్య విపరీతమైన నమ్మకం, గౌరవం ఉండాలి. ఇల్లు షేర్ చేసుకోవడం అంటే ఒకరి పర్సనల్ స్పేస్‌లోకి మరొకరు వస్తున్నట్టే! మరోరకంగా చూస్తే.. ఆర్థిక భారం ఎక్కువే. ఇది అందరికీ సాధ్యం కాకపోవచ్చు. పిల్లల కోసం ఒక ఇల్లు మెయింటైన్ చేస్తూ, తల్లిదండ్రులు విడివిడిగా ఉండటానికి మరో రెండుచోట్ల వసతి చూసుకోవాలి. అంటే మూడు ఇళ్ల ఖర్చు భరించగల ఆర్థిక స్థితి ఉండాలి. న్యాయపరమైన చిక్కులు ఉండొచ్చు. భారతీయ కోర్టులు పిల్లల సంక్షేమానికే ప్రాధాన్యత ఇస్తాయి. తల్లిదండ్రులు సంయుక్తంగా పటిష్ఠమైన ప్లాన్ ఇస్తే కోర్టులు నెస్టింగ్ను అంగీకరిస్తాయి. కానీ, ఆస్తి పంపకాల విషయంలో ఇది భవిష్యత్తులో చిక్కులు తెచ్చే అవకాశం ఉందని లాయర్లు హెచ్చరిస్తున్నారు. విడాకుల తర్వాత తొలి రెండు మూడేళ్లు పిల్లలు సర్దుకోవడానికి ఇది అద్భుతంగా పనిచేస్తుంది. కానీ, జీవితాంతం ఇలా ఉండటం ప్రాక్టికల్‌గా కష్టం అంటున్నారు మరికొందరు.
విడాకుల గాయం నుంచి కోలుకోకముందే మళ్లీ అదే పాత ఇంట్లోకి వెళ్లడం తల్లిదండ్రులకు మానసిక ఒత్తిడిని కలిగిస్తుంది. మాజీ భాగస్వామి వాడిన వస్తువులను చూడటం, ఆ జ్ఞాపకాలను పంచుకోవడం అంత సులభం కాదు. అయితే, తమకంటే పిల్లల భవిష్యత్తే ముఖ్యం అనుకునే మెచ్యూర్డ్ పేరెంట్స్ ఈ ప్రయోగాన్ని ధైర్యంగా చేస్తున్నారు. విడాకులు అనేవి ఒక ముగింపు కావొచ్చు.. కానీ, పేరెంటింగ్ అనేది ఒక నిరంతర ప్రయాణం. ఇక ‘నెస్టింగ్’ అనేది పిల్లల కోసం తల్లిదండ్రులు చేసే ఒక త్యాగం. ఇది అందరికీ సెట్ కాకపోవచ్చు, కానీ సంప్రదాయ పద్ధతుల్లో పిల్లలు నలిగిపోకుండా చూడటానికి ఇదొక చక్కని ప్రత్యామ్నాయం.