Ceasefire | నియంత్రణ రేఖ (LoC) వెంట సరిహద్దులు దాటి పాకిస్తాన్ కాల్పుల ఉల్లంఘనకు పాల్పడుతున్నది. కుప్వారా, బారాముల్లా, ఉరి, అఖ్నూర్ సరిహద్దు పోస్టుల వద్ద పాక్ సైన్యం కాల్పులకు తెగబడుతున్నది. సరిహద్దుల్లో కాల్పుల తీవ్రతను పాక్ సైన్యం పెంచుతున్నది. ఆపరేషన్ సిందూర్ తర్వాత పాక్ రేంజర్లు తీవ్రతను మరింత పెంచారు. అదే సమయంలో నిన్నటి నుంచి ఆయుధాలను సైతం సైన్యం మార్చింది. చిన్న ఆయుధాల నుంచి మోర్టార్ గన్స్, శతఘ్నులతో దాడులకు దిగుతున్నారు. పాక్ రేంజర్ల కాల్పులను భారత సైన్యం ధీటుగా ఎదుర్కొంటూ బదులిస్తున్నది. పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్ ఊహించని విధంగా షాక్ ఇవ్వడంతో పాకిస్తాన్ సైన్యం మరింత రెచ్చిపోతున్నది.
పూంచ్, బారాముల్లా, రాజౌరి జిల్లాల్లో నియంత్రణ రేఖ (LoC) సమీపంలోని గ్రామాలపై మంగళవారం రాత్రంతా దాడులకు తెగబడింది. పాకిస్తాన్ జరిపిన కాల్పుల్లో నలుగురు పిల్లలు సహా 15 మంది మరణించిన విషయం తెలిసిందే. జమ్మూ, శ్రీనగర్‌లోని అనేక ప్రాంతాల్లో బుధవారం మధ్యాహ్నం 2 గంటల వరకు షెల్లింగ్ కొనసాగిందని ఆర్మీ వర్గాలు తెలిపారు. భారత్ జరిపిన ప్రతి దాడుల్లో పాక్ సైనికులు సైతం ప్రాణాలు కోల్పోయారు. డజన్ల కొద్దీ పాక్ పోస్టులు ధ్వంసమయ్యాయి. ఉద్రిక్తత నేపథ్యంలో జమ్మూ, శ్రీనగర్ డివిజన్లోని పలు పాఠశాలలను మూసివేశారు. ముందు జాగ్రత్త చర్యగా జమ్మూ, శ్రీనగర్, లేహ్ నుంచి విమాన సేవలు, కథువాకు హెలికాప్టర్ సేవ నిలిపివేశారు. అన్ని ప్రభుత్వ విభాగాలలోని అధికారులు, ఉద్యోగుల సెలవులు రద్దు చేశారు. భారత సైనికులు ఉగ్రవాదాన్ని అణచివేసేందుకు పాక్, పీవోకేలోని ఉగ్రస్థావరాలపై దాడి చేసింది.
ఇన్నాళ్లు వితండవాదం చేస్తూ ఉగ్రవాదులను పెంచి పోషించిన పాకిస్తాన్ సైన్యం ప్రస్తుతం సరిహద్దుల్లో బుసలు కొడుతున్నది. ఎల్వోసీని ఆనుకొని ఉన్న బాలకోట్, మెంధార్, మాన్‌కోట్, కృష్ణ ఘాటి, గుల్పూర్, కెర్ని, పూంచ్ కాల్పులు జరుపుతూ వచ్చింది. పాక్ దాడిలో పెద్ద సంఖ్యలో ఇండ్లు దెబ్బతిన్నాయి. బారాముల్లా జిల్లాలోని ఉరి సెక్టార్లో సరిహద్దు దాటి జరిపిన కాల్పుల్లో ఐదుగురు పిల్లలు సహా పది మంది గాయపడ్డారు. రాజౌరి జిల్లాలోని థండికాస్సి, ఇరా ద ఖేత్రా, గంభీర్ బ్రాహ్మణ్ గ్రామాలపై పాకిస్తాన్ కాల్పులు జరిపింది. పూంచ్ జిల్లాలోని నియంత్రణ రేఖకు సమీపంలో ఉన్న గురుద్వారా సాహిబ్‌ను పాకిస్తాన్ లక్ష్యంగా చేసుకుంది. పూంచ్ కాల్పులు కొనసాగాయి. దాంతో భారీగా వాహనాలు దెబ్బతిన్నాయి. కుప్వారా జిల్లాలోని కర్నా సెక్టార్లో కాల్పుల కారణంగా అనేక ఇళ్లు మంటల్లో చిక్కుకున్నాయి. భారీ కాల్పుల కారణంగా బాధితులను ఆసుపత్రికి తరలించేందుకు ఇబ్బందులు ఎదురయ్యాడు. ఉద్రిక్తత మధ్య అఖ్నూర్ ప్రాంత సరిహద్దు ప్రాంతాల నుంచి చాలా మంది తమ ఇళ్లను వదిలి సురక్షిత ప్రాంతాలకు వెళ్లారు.
ఫిబ్రవరి 25, 2021న భారతదేశం-పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. అయినా తరుచూ పాకిస్తాన్ కాల్పుల విరమణను ఉల్లంఘిస్తూ వస్తున్నది. కాల్పుల విరమణకు ముందు 2018 సంవత్సరంలో భారీ నష్టం జరిగింది. సరిహద్దు ప్రాంతాల్లో పాకిస్తాన్ జరిపిన షెల్లింగ్‌లో 30 మంది పౌరులు మరణించారు. 2019లో 18 మంది పౌరులు, 2020లో 15 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు. పాకిస్తాన్ కాల్పుల నేపథ్యంలో స్థానిక ప్రభుత్వం పరిస్థితిని ఎదుర్కోవడానికి పూర్తిగా సిద్ధంగా ఉంది. సున్నితమైన ప్రాంతాల నుంచి ప్రజలను సురక్షితమైన ప్రదేశాలకు తరలించి, బోర్డింగ్, వసతి, ఆహారం, వైద్యం, రవాణాను నిర్ధారించాలని జిల్లా డిప్యూటీ కమిషనర్లకు ఆదేశాలు జారీ అయ్యాయి.