Rahul Gandhi : కేంద్ర ఎన్నికల సంఘం (Election Commission of India) తీరుపై లోక్‌సభ (Lok Sabha) లో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, కాంగ్రెస్ ఎంపీ (Congress MP) రాహుల్ గాంధీ (Rahul Gandhi) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల సంఘం తీరుతో మహారాష్ట్ర (Maharastra) ఓటర్ల జాబితాల్లో భారీగా అవకతవకలు జరిగాయని ఆరోపించారు. లోక్‌సభ ఎన్నికలప్పుడు లేని 39 లక్షల మంది ఓటర్ల పేర్లు మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలప్పుడు జాబితాల్లోకి వచ్చాయని ఆశ్యర్యం వ్యక్తం చేశారు. కేవలం ఐదు నెలల వ్యవధిలో ఆ 39 లక్షల మంది ఓటర్లు ఎక్కడి నుంచి వచ్చారని ప్రశ్నించారు.
దేశ రాజధాని ఢిల్లీలోని కాన్స్టిట్యూషన్ క్లబ్ ఆఫ్ ఇండియాలో ఉద్ధవ్ థాకరే శివసేన ఎంపీ సంజయ్ రౌత్, శరద్ పవార్ ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలేతో కలిసి ఏర్పాటు చేసిన జాయింట్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో రాహుల్‌గాంధీ మాట్లాడారు. మహారాష్ట్రలో లోక్‌సభ ఎన్నికల కంటే ముందు ఐదేళ్ల కాలంలో పెరిగిన ఓటర్లకు సమానంగా కేవలం గత ఐదు నెలల్లోనే పెరిగారని, ఇది ఎలా జరిగిందో ఎన్నికల సంఘం చెప్పాలని ఆయన ప్రశ్నించారు.
అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు కోసం విచ్చలవిడిగా ఇతర రాష్ట్రాలకు చెందిన వారిని మహారాష్ట్ర ఓటర్ల జాబితాలో చేర్చారని రాహుల్ గాంధీ ఆరోపించారు. ఈ విషయంలో ఎన్నికల సంఘం అధికార కూటమికి అనుకూలంగా వ్యవహరించిందని విమర్శించారు. దాంతో మహారాష్ట్రలో ఓటర్ల సంఖ్య ఆ రాష్ట్ర జనాభాను మించిపోయిందని వ్యాఖ్యానించారు. ఐదు నెలల్లో పెరిగిన ఓటర్ల సంఖ్య ఇంచుమించుగా హిమాచల్ ప్రదేశ్ జనాభాకు సమానమని అన్నారు.
ఈ కొత్త ఓటర్లంతా ఎక్కడి నుంచి వచ్చారని రాహుల్‌గాంధీ ప్రశ్నించారు. వారంతా ఎవరని నిలదీశారు. మహారాష్ట్ర ఓటర్ల జాబితాను ప్రతిపక్ష పార్టీలు క్షుణ్ణంగా అధ్యయనం చేశాయని, ఈ అధ్యయనం ద్వారా ఓటర్ల జాబితాలో అనేక అక్రమాలు జరిగినట్లు తేలిందని చెప్పారు. అందుకే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పోటీపడ్డ ప్రతిపక్ష పార్టీలన్నీ ఒక్క తాటిపైకి వచ్చి ప్రశ్నిస్తున్నాయని, ఎన్నికల సంఘం సమాధానం చెప్పి తీరాలని ఆయన డిమాండ్ చేశారు.
KTR | రాష్ర్టాల హక్కులు కాలరాయొద్దు.. యూజీసీ నిబంధనలు సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధం: కేటీఆర్
Bodhan | నేనే డాన్ అంటూ రౌడీ షీటర్ వీరంగం.. దేహశుద్ధి చేసిన జనం
Road accident | వనపర్తి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి, నలుగురికి గాయాలు