Culcutta High Court : కోల్కతా (Kolkata) లోని ఆర్జీ కర్ ఆస్పత్రి (RG Kar hospital) మెడికల్ కాలేజీలో జూనియర్ డాక్టర్ (Junior Doctor) పై అత్యచారానికి పాల్పడి, హత్య చేసిన ఘటనపై పశ్చిమబెంగాల్ (West Bengal) ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ను కలకత్తా హైకోర్టు (Culcutta High Court) తోసిపుచ్చింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు అయిన సంజయ్ రాయ్ (Sanjay Roy) కి మరణదండన విధించాలని కోరుతూ ఇటీవల బెంగాల్ ప్రభుత్వం కలకత్తా హైకోర్టులో పిటిషన్ వేసింది.
ఆ పిటిషన్పై శుక్రవారం విచారణ జరిపిన కలకత్తా హైకోర్టు.. బెంగాల్ ప్రభుత్వ అభ్యర్థనను తోసిపుచ్చింది. కేసులో ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్కి మరణ శిక్ష విధించాలని కోరే హక్కు బెంగాల్ ప్రభుత్వానికి లేదని హైకోర్టు స్పష్టం చేసింది. కేవలం ఈ కేసు దర్యాప్తు చేసిన సీబీఐకి మాత్రమే మరణదండన విధించాలని కోరే హక్కు ఉంటుందని పేర్కొంది. దేవాంగ్షు బసక్ నేతృత్వంలోని డివిజన్ బెంచ్ పిటిషన్పై విచారణ జరిపింది.
ఇదిలావుంటే ఆర్జీ కర్ ఆస్పత్రిలో అత్యాచారం, హత్యకు గురైన ట్రెయినీ డాక్టర్ తల్లిదండ్రులు దాఖలు చేసిన పిటిషన్పై సత్వరమే విచారణ చేపట్టాలంటూ సుప్రీంకోర్టులో మరో పిటిషన్ దాఖలైంది. అయితే పిటిషన్పై సత్వర విచారణకు సర్వోన్నత న్యాయస్థానం నిరాకరించింది. మార్చి 17న విచారణ చేపట్టనున్నట్లు తెలిపింది. కాగా గత నెల 20న కేసులో ప్రధాని నిందితుడు అయిన సంజయ్ రాయ్కి దిగువ కోర్టు జీవితఖైదు విధించింది.
గత ఏడాది ఆగస్టు 9న ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్లో పోస్ట్ గ్రాడ్యుయేట్ ట్రెయినీ అయిన జూనియర్ డాక్టర్ అత్యాచారం, హత్యకు గురైంది. ఆస్పత్రి సెమినార్ హాల్లో ఆమె మృతదేహం కనిపించింది. ఈ ఘటన యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్లు వెల్లువెత్తాయి. ఘటన జరిగిన మరుసటి రోజే పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. 162 రోజుల తర్వాత గత నెల 20 దిగువ కోర్టు నిందితుడికి శిక్ష విధించింది.
KTR | రాష్ర్టాల హక్కులు కాలరాయొద్దు.. యూజీసీ నిబంధనలు సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధం: కేటీఆర్
Bodhan | నేనే డాన్ అంటూ రౌడీ షీటర్ వీరంగం.. దేహశుద్ధి చేసిన జనం
Road accident | వనపర్తి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి, నలుగురికి గాయాలు