KTR | హైదరాబాద్, ఫిబ్రవరి 6 (నమస్తే తెలంగాణ): రాష్ట్రాల హకులను హరిస్తూ ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధంగా రాష్ట్ర పరిధిలోని అంశాలను కేంద్రం తీసుకోవడం సరికాదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు స్పష్టంచేశారు. రాష్ట్ర యూనివర్సిటీల వైస్‌చాన్సలర్ల నియామకానికి సెర్చ్ కమిటీల ఏర్పాటు బాధ్యతను గవర్నర్లకు అప్పగిస్తూ యూజీసీ తీసుకొస్తున్న నిబంధనలపై ఆగ్రహం వ్యక్తంచేశారు. గురువారం ఢిల్లీలో కేటీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ ప్రతినిధి బృందం కేంద్ర మానవనరుల అభివృద్ధి శాఖ మంత్రి ధర్మేంద్రప్రధాన్, కేంద్ర ఉపరిత ల రవాణాశాఖ మంత్రి నితిన్‌గడ్కరీని కలిసింది. ఆయా అంశాలపై బీఆర్ఎస్ వైఖరిని లిఖితపూర్వకంగా అందజేసింది. అనంతరం కేటీఆర్ ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. యూజీసీ నూతన మార్గదర్శకాలపై విద్యారం గ మేధావులతో లోతుగా చర్చించి, ధర్మేంద్రప్రధాన్‌కు ఆరు పేజీల వినతిపత్రం అందజేశామని తెలిపారు.
కేంద్రం గవర్నర్ల ద్వారా రాష్ట్ర యూనివర్సిటీల పాలన, నియామకాలను చేతుల్లోకి తీసుకోవడం సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధమని హెచ్చరించారు. రాష్ర్టాల హక్కుల ను కాలరాసేలా ఉన్న నిబంధనలను ఉపసంహరించుకోవాలని కేంద్రాన్ని కోరామని తెలిపారు. యూజీసీ మార్గదర్శకాల్లో సరైన అభ్యర్థులు (నో సూటబుల్ క్యాండిడేట్ ఫౌండ్) అనే నిబంధనలను చేర్చడం వల్ల ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఉన్న రిజర్వేషన్ల ప్రకారం కాకుండా అభ్యర్థులు దొరకలేదనే సాకుతో ఆ ఉద్యోగా లు ఇతర క్యాటగిరీలతో భర్తీ చేసే ప్రమాదం ఉన్నదని ఆందోళన వ్యక్తంచేశారు.
అలా చేయ డం రాజ్యాంగ విరుద్ధమని, దాని ద్వారా ఆయా సామాజిక వర్గాలకు దక్కిన హక్కును కేంద్రం హరించినట్టే అవుతుందని స్పష్టంచేశారు. వర్సిటీ ఉద్యోగాల భర్తీలో విద్యార్హతల కు మాత్రమే కాకుండా పరిశోధనలకు కూడా ప్రాధాన్యం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. వీసీ నియామకంలో పారదర్శకతను పాటించాలని కేంద్రానికి స్పష్టంచేశామని చెప్పారు.
మిడ్ మానేరు మీదుగా రోడ్ కమ్ రైల్ బ్రిడ్జిను నిర్మించాలని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీకి విజ్ఞప్తి చేశామని కేటీఆర్ వెల్లడించారు. గతంలో వినోద్‌కుమార్ ఎంపీగా ఉన్నప్పుడు మంజూరైన ఎన్‌హెచ్-365 (బీ)ని వేములవాడ, కొండగట్టు, ధర్మపురి ఆలయాలు, మధ్యమానేరు జలాశయం మీదుగా ధవళేశ్వరం దగ్గర వంతెన మాదిరిగా రైల్ కమ్రోడ్ బ్రిడ్జి నిర్మించాలని కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్ సూచించారని చెప్పారు. ఆ మేరకు ఎన్‌హెచ్-365 (బీ)ని కోరుట్ల మీదుగా తీసుకెళ్లి ఎన్‌హెచ్-63కి అనుసంధానం చేయాలని విజ్ఞప్తి చేశామని వివరించారు. దీనిపై నితిన్‌గడ్కరీ సానుకూలంగా స్పందించారని చెప్పారు.
పార్టీ మారిన పది మంది ఎమ్మెల్యేలపై వేటు పడాల్సిందేనని, ఈ విషయంలో తాము రాజీలేని పోరాటం చేస్తున్నామని కేటీఆర్ స్పష్టంచేశారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై వేటుపడాలని, ఉప ఎన్నికలు రావాలని ఆయా నియోజకవర్గాల్లో ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు. అనర్హతవేటు విషయంలో ఇప్పటికే తమ పార్టీ సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో నోటీసులు జారీచేసిందని గుర్తుచేశారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా ఎమ్మెల్యేల అనర్హత వేటు విషయంలో న్యాయవాదులు, న్యాయ నిపుణులతో చర్చిస్తున్నామని తెలిపారు.
కేంద్ర మంత్రులను కలిసిన బీఆర్ఎస్ ప్రతినిధి బృందంలో విద్యాశాఖ మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, పార్లమెంటరీ పార్టీ నేత కేఆర్ సురేశ్‌రెడ్డి, ఎంపీలు దీవకొండ దామోదర్‌రావు, వద్దిరాజు రవిచంద్ర, పార్థసారథిరెడ్డి, ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్, మాజీ ఎంపీలు బోయినపల్లి వినోద్‌కుమార్, బాల్క సుమన్, పార్టీ నేతలు దాసోజు శ్రవణ్, గెల్లు శ్రీనివాస్‌యాదవ్, ఆంజనేయులుగౌడ్, వాసుదేవరెడ్డి తదితరులు ఉన్నారు.