శక్కర్ నగర్ : బోధన్ పట్టణంలోని(Bodhan town) ఘోషాలకు చెందిన అబ్బు అలియాస్ అబ్దుల్లా అనే రౌడీషీటర్( Rowdy sheeter) గురువారం రాత్రి వీరంగం సృష్టించాడు. అతనిపై ఇప్పటికే పలు కేసులు నమోదు కాగా, గత మూడు నెలల క్రితం ఓ మిర్చి బండి వ్యక్తిపై డబ్బులు ఇవ్వాలంటూ దౌర్జన్యం చేసి, దాడికి యత్నించగా సదరు వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అతన్ని పోలీసులు విచారించే క్రమంలో పోలీసులపై కూడా దాడికి పాల్పడ్డాడు. దీంతో పోలీసుల విధులకు ఆటంకం కలిగించి, దాడికి యత్నించాడంటూ కేసు నమోదు చేసి జైలుకు పంపారు.
కాగా, ఈనెల 4వ తేదీన జైలు నుంచి వచ్చిన అబ్బు, తిరిగి గురువారం రాత్రి పాత బస్టాండ్ ప్రాంతంలో హంగామా సృష్టించాడు. ఓ ఐరన్ రాడ్ పట్టుకొని నేనే డాన్‌ను అంటూ పలువురిపై దాడికి యత్నించాడు. దీంతో స్థానిక ప్రజలు అతనిపై దాడికి పాల్పడ్డారు. విషయం తెలుసుకున్న బోధన్ పట్టణ సీఐ వెంకట నారాయణ, సిబ్బందితో కలిసి సంఘటన స్థలానికి చేరుకున్నారు. గాయాలైన రౌడీషీటర్‌ను బోధన్ జిల్లా ప్రభుత్వ హాస్పిటల్‌కు తరలించారు. ప్రస్తుతం అతను బోధన్ ప్రభుత్వ దవాఖానలో పోలీసుల కాపలా మధ్య చికిత్సలు పొందుతున్నాడు. నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేసినట్లు సీఐ వెంకటనారాయణ తెలిపారు.