వనపర్తి : వనపర్తి (Wanaparthy)జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కారును కంటెయినర్, డీసీఎం ఢీ కొనడంతో(DCM hits car )ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా మరో నలుగురికి గాయాలయ్యాయి. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ విషాదకర సంఘటన పెద్దమందడి మండలం వెల్టూరు గ్రామంలోని జాతీయ రహదారిపైచోటు చేసుకుంది. ఎస్ఐ యుగంధర్ రెడ్డి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నందికొట్కూరు చెందిన చిన్న బాబు కుటుంబం హైదరాబాద్లో ఉంటున్నారు.
కాగా, గురువారం హైదరాబాద్ నుంచి సొంతూరు నందికొట్కూరుకు బయలుదేరారు. వెల్టూరు గ్రామం దగ్గర రాగానే డీసీఎం సడన్ బ్రేక్ వేయడంతో వెనకాల వస్తున్న కారు డీసీఎంను ఢీకొట్టగా కారు వెనకాల వస్తున్న మరో భారీ కంటైనర్ కారును ఢీకొట్టింది. కంటైనర్, డీసీఎం మధ్యలో కారు ఇరుక్కుపోయి నుజ్జు నుజ్జు అయ్యింది. కారులో ప్రయాణిస్తున్న ఆరుగురిలో చిన్న బాబు భార్య సిద్దు (45), మనువడు అఫియాన్ (10) అక్కడికక్కడే మృతి చెందగా చిన్న బాబుకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని హాస్పిటల్కు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.