Rahul Gandhi | కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi)కి బిగ్ షాక్ తగిలింది. ఆర్మీపై (Indian Army) అనుచిత వ్యాఖ్యలకు సంబంధించిన కేసులో లక్నో కోర్టు (Lucknow court) రాహుల్‌కు సమన్లు జారీ చేసింది. వచ్చే నెలలో కోర్టు ముందు హాజరు కావాలని ఆదేశించింది.
2022 డిసెంబర్లో భారత్ జోడో యాత్ర (Bharat Jodo Yatra) సందర్భంగా భారత సైన్యాన్ని అవమానించేలా రాహుల్ గాంధీ వ్యాఖ్యలు చేశారు. ‘చైనా గురించి మీడియా నన్ను ఏమీ అడగదని నేను నా స్నేహితుడితో పందెం కాశాను. రెండు వేల చదరపు కిలోమీటర్ల భారత భూభాగాన్ని ఆక్రమించిన దేశం గురించి, మన సైనికులను చంపిన దేశం గురించి, అరుణాచల్ ప్రదేశ్‌లో మన సైనికులపై దాడులు చేస్తున్న దేశం గురించి ప్రెస్ నన్ను ప్రశ్నించదు. నేను చెప్పింది నిజమే. దేశం గమనిస్తోంది, వేరేలా ఆలోచించొద్దు’ అంటూ వ్యాఖ్యానించారు.
రాహుల్ చేసిన ఈ వ్యాఖ్యలు అప్పట్లో తీవ్ర వివాదాస్పదమయ్యాయి. భారత సైన్యం కూడా ఈ వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించింది. 2022 డిసెంబర్ 12న రాహుల్ వ్యాఖ్యలపై ఆర్మీ స్పష్టత నిచ్చింది. చైనా ఆర్మీ అరుణాచల్ ప్రదేశ్‌లోకి అక్రమంగా ప్రవేశించిందని తెలిపింది. ఇండియన్ ఆర్మీ దానిని బలంగా తిప్పికొట్టినట్లు పేర్కొంది.
అయితే, రాహుల్ తన వ్యాఖ్యలతో భారత ఆర్మీని అవమానించారంటూ బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ (బీఆర్వో) మాజీ డైరెక్టర్ ఉదయ్ శంకర్ శ్రీవాస్తవ ఫిర్యాదు చేశారు. సరిహద్దులను కాపాడుతున్న ఆర్మీపై ఇలాంటి వ్యాఖ్యలు తగవని పేర్కొన్నారు. ఆయన వ్యాఖ్యలు భారత సైనిక దళాలను అవమానించేవిగా, అప్రతిష్టపాలు చేసేవిగా ఉన్నాయన్నారు. ఈ ఫిర్యాదు మేరకు లక్నో కోర్టు రాహుల్‌కు సమన్లు జారీ చేసింది. మార్చి 24వ తేదీన తమ ముందు హాజరు కావాలని లక్నో స్పెషల్ ఎంపీ- ఎమ్మెల్యే కోర్టు రాహుల్‌కు సమన్లు జారీ చేసింది.
Also Read..
Ram Temple Priest | అయోధ్య రామాలయ ప్రధాన పూజారి కన్నుమూత
Ragging: జూనియర్లపై దారుణంగా ర్యాగింగ్.. ఆ కేసులో అయిదుగురు విద్యార్థులు అరెస్టు
Bank Fraud Case: 2 వేల కోట్ల బ్యాంకు ఫ్రాడ్ కేసులో సీబీఐని తప్పపట్టిన హైకోర్టు