అమరావతి : ఏపీలో రాజకీయంగా వైయస్ జగన్‌ను ఎదుర్కోలేక చంద్రబాబు కుట్రలు చేస్తున్నాడని వైయస్ఆర్సీపీ స్టేట్ కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణా రెడ్డి( Sajjala Ramakrishna Reddy ) ఆరోపించారు. శనివారం తాడేపల్లిలో ఆయన మీడియాతో మాట్లాడారు. శ్రీవారి లడ్డూ ( Tirumala Laddu ) కల్తీపై చంద్రబాబు తప్పుడు ప్రచారం వెనుక ఒక పెద్ద ఆర్థిక కుంభకోణం దాగి ఉందనే విషయం కూడా బయటికి వచ్చిందని ఆరోపించారు.
తిరుమల లడ్డూకు నెయ్యి కొనుగోళ్లపై సీఐడీ( CID Investigation ) తో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నరలోనే లడ్డూపై చేసిన ఆరోపణల ద్వారా, అధిక ధరలకు నెయ్యిని టీటీడీ నుంచి కొనిపించి 200 కోట్ల పైన దోపిడీ చేశారని పేర్కొన్నారు. రూ.650 ఖర్చు చేస్తే నాణ్యమైన నెయ్యి అయిపోతుందా? అని, గతంలో కంటే నెయ్యి నాణ్యత మెరుగ్గా ఉండటానికి చంద్రబాబు ఏమైనా చర్యలు తీసుకున్నాడా? . వైసీపీ హయాంలో ఉన్న అవే ప్రమాణాలతో టెస్టులు జరుగుతుండటం వాస్తవం కాదా? అని ప్రశ్నించారు.
చంద్రబాబు ఫ్యామిలీకి చెందిన హెరిటేజ్ ఎలాగూ పాలు, పెరుగు, నెయ్యి వ్యాపారంలో ఉండటంతో, తమ డెయిరీ పార్టనర్స్‌తో కలిసి లబ్ధి పొందే కుట్రకు తెరదీశారని విమర్శించారు. 2014 నుంచి టీటీడీ కొనుగోలు చేసిన నెయ్యి రేట్లు చూస్తే చంద్రబాబు అధికారంలోకి వచ్చాక భారీగా 104 శాతం ధరలు పెరిగాయని వెల్లడించారు.
టెండర్ నిబంధనలపై కూటమి చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని, నిబంధనలు కఠినతరం చేసిన తర్వాత కూడా అవే కంపెనీలు టెండర్లు వేసి అర్హత సాధించి నెయ్యి సప్లై చేస్తున్నాయని దుయ్యబట్టారు. టెండర్ నిబంధనల వల్ల కొత్త సంస్థలేవో వచ్చి నాసిరకం నెయ్యిని సప్లై చేయడంలాంటిది ఏదీ జరగలేదని స్పష్టం చేశారు.
మార్కెట్ లో ప్యాకింగ్ చేసిన నెయ్యే రూ.550 కి దొరుకుతున్నప్పుడు రూ.750 కి టీటీడీకి ఎందుకు సప్లై చేస్తుందని, పెద్ద డెయిరీ సంస్థలు ఎందుకు టెండర్లలలో పాల్గొనడం లేదని , ఎప్పుడూ ముగ్గురు ప్లేయర్లే ఎందుకు ఘీ సప్లై చేస్తున్నారని ప్రశ్నించారు. దేవుడి ప్రసాదాన్ని కూడా అనుమానంతో చూసే పరిస్థితి తీసుకొచ్చారని చంద్రబాబుపై మండిపడ్డారు. ఇదంతా చేసింది టీటీడీకి సప్లై చేసే నెయ్యి రేటును పెంచి, తద్వారా తన సిండికేట్ కు లబ్ధి చేకూర్చుకోవడానికేనని సజ్జల ఆరోపించారు.