మియాపూర్, జూలై 24: శేరిలింగంపల్లి నియోజకవర్గంలో ఓటరు జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియలో వింతలు చోటు చేసుకుంటున్నాయి. మియాపూర్ సర్కిల్ పరిధిలోని హఫీజ్‌పేట్ వార్డులో ఇద్దరు ఓటర్లు ఏండ్ల తరబడి ఇక్కడే నివాసం ఉండటంతో పాటు పలు ఎన్నికలలోనూ తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. అయితే ఇటీవల చేపడుతున్న సర్ ప్రక్రియలో భాగంగా వారి వివరాల మ్యాపింగ్ బీహార్‌లో జరిగిందని తేలడంతో వారు ఖంగుతిన్నారు. మ్యాపింగ్‌కు సంబంధించి తమకెలాంటి సంబంధంలేని అధికారులకు విన్నవించారు. అధికారులు బీహార్ రాష్ట్రపు బీఎల్వోలను సంప్రదించేందుకు ఎంత ప్రయత్నించినా ఫలితం దక్కలేదు.
అక్కడ అన్‌మ్యాపింగ్ అయితే తప్ప ఇక్కడ మ్యాపింగ్ చేసే అవకాశం లేకపోవటంతో అన్అవైలబుల్ వివరాలతో స్థానిక వివరాలతో ఎన్యుమరేషన్ దరఖాస్తును స్వీకరించారు. బీఎల్వో కేంద్రాలలో ఓటర్ల ఎపిక్ (ఓటరు గుర్తింపు)కార్డు ఆధారంగా వివరాలను వెతికే క్రమంలో అదే నంబర్‌తో చెన్నై రాష్ట్రంలోని ఓటర్ల వివరాలను ప్రదర్శించటం విశేషం. ఇదే సర్కిల్ పరిధిలోని మియాపూర్ వార్డులో ఓ ఇంటి నంబర్‌పై ఏకంగా 50 ఓట్లున్నట్లు పూర్వపు ఓటరు జాబితా స్పష్టం చేసింది. గతంలో ఓటు హక్కు కోసం సమర్పించిన ఆన్లైన్ దరఖాస్తులలో ఒకే ఫోన్ నంబరుతో ఏకంగా 85కు పైగా ఓట్లున్నట్లు అధికారులు గుర్తించారు. ఇలాంటివి చూసి అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ఈఆర్వో నారాయణ్ అమిత్ ఎప్పటికపుడు అధికారులతో సమీక్ష సమావేశాలు నిర్వహిస్తూ క్షేత్రస్థాయిలో ప్రక్రియను వేగవంతం చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారు.