– ఏరియా సేఫ్టీ ఆఫీసర్ వెంకటేశ్వర్లు
రుద్రంపూర్, సెప్టెంబర్ 29 : అత్యవసర పరిస్థితుల్లో ప్రాణాలను కాపాడేందుకు హృదయ-శ్వాస పునరుద్ధరణ (సి పి ఆర్)పై ప్రతి కార్మికుడు ప్రాథమిక అవగాహన కలిగి ఉండాలని కొత్తగూడెం ఏరియా సేఫ్టీ ఆఫీసర్ వెంకటేశ్వర్లు అన్నారు. సోమవారం వెంకటేష్ ఖని కోల్ మైన్ లోని ఆఫ్ లోడింగ్ క్యాంప్ కార్మికులకు నిర్వహించిన సిపిఆర్ శిక్షణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ప్రమాదాలు, ఆకస్మిక గుండెపోటు వంటి అత్యవసర పరిస్థితుల్లో బాధితుడికి వైద్య సాయం అందేలోపు సిపిఆర్ చేయడం ఎంతో కీలకమని తెలిపారు. సరైన సమయంలో సరైన పద్ధతిలో సిపిఆర్ అందిస్తే ప్రాణాలను కాపాడే అవకాశం ఉంటుందన్నారు. అందుకే సింగరేణి సంస్థ ఆదేశాల మేరకు కార్మికులకు సిపిఆర్ పై అవగాహనతో పాటు ప్రాక్టికల్ శిక్షణ అందిస్తున్నామని చెప్పారు.
కార్మికులు కేవలం తమ పని ప్రదేశంలోనే కాకుండా బయట కూడా అత్యవసర పరిస్థితుల్లో ఈ శిక్షణను ఉపయోగించుకునే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. సిపిఆర్ చేసే విధానాన్ని ప్రతి ఒక్కరూ పూర్తిగా నేర్చుకోవడంతో పాటు, అవసరమైన సమయంలో ధైర్యంగా స్పందించాలని సూచించారు. “అత్యవసర పరిస్థితుల్లో తొలి స్పందన చాలా ముఖ్యం. వైద్య సాయం అందేలోపు సి పి ఆర్ అందించడం ద్వారా ఒక ప్రాణాన్ని నిలబెట్టే అవకాశం ఉంటుంది. అందుకే ప్రతి కార్మికుడు సిపిఆర్ పై అవగాహన కలిగి ఉండాలి” అన్నారు. అనంతరం వి కే సి ఎం రెస్క్యూ టీం సభ్యులు కార్మికులకు సిపిఆర్ ప్రాథమిక విధానాలను వివరించి, డమ్మీపై ప్రాక్టికల్ డెమో నిర్వహించారు. కార్మికులతో స్వయంగా సిపిఆర్ చేయించి శిక్షణ అందించారు. ఈ కార్యక్రమంలో ప్రాజెక్టు ఆఫీసర్ జి.శంకర్, గని మేనేజర్ ఎస్ఎస్ఆర్ మురళి, సేఫ్టీ ఆఫీసర్ అనిల్‌కుమార్, డ్రిల్లింగ్ ఇన్చార్జి రాందాస్, కొత్తగూడెం ఏరియా రెస్క్యూ టీం సభ్యులు, ఆఫ్ లోడింగ్ కార్మికులు పాల్గొన్నారు.