దేనికైనా పట్టువిడుపులు ఉండాలి. లేకపోతే పలు ప్రమాదాలు సంభవిస్తాయి. ఈ సూత్రం మన దేశ ప్రధానికి, అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు వర్తిస్తాయి. ముందుగా మన దేశ ప్రధాని విషయంలో చూస్తే, రెండు సందర్భాల్లో స్పష్టంగా కనిపిస్తున్నది. మొదటి సందర్భం… సరిగ్గా ఆరేండ్ల క్రితం రైతులకు తీవ్ర నష్టం వాటిల్లే ‘నల్ల వ్యవసాయ చట్టాలను‘ రూపొందించి, బలవంతంగా అమల్లోకి తీసుకురావాలని ప్రయత్నించారు. రైతుల వీరోచిత పోరాట పటిమతో, సుప్రీంకోర్టు జోక్యంతో మొదటి సారిగా మోదీ వెనక్కి తగ్గకతప్పలేదు. తాను తయారు చేసి అమలు చేయాలని చూసిన చట్టాలను తానే రద్దు చేసుకొని, రైతులకు క్షమాపణ చెప్పవలసి వచ్చింది. మొండికిపోకుండా ముందుగానే రైతులు, ప్రతిపక్ష నేతలు, నిపుణులతో చర్చలు జరిపి, సమస్యల పరిష్కారానికి కృషి చేస్తే రైతులకు మేలు జరిగేది కదా! అంతమంది రైతుల ప్రాణాలు పోయేవి కాదు కదా!
కేంద్ర ప్రభుత్వం నల్ల వ్యవసాయ చట్టాలు తీసుకొచ్చినప్పుడు రైతులు ఏడాదికిపైగా కరోనా కష్టకాలంలో ఢిల్లీ సరిహద్దులో రేయింబవళ్లు ఉద్యమించారు. కానీ మోదీ అహాన్ని వదిలించడానికి చేసిన పోరాటం భారత చరిత్రలో మైలురాయి. ఇక రెండో సందర్భం.. తాజాగా విద్యార్థుల విషయంలో మోదీ అనుసరిస్తున్న వైఖరిని అందరం చూస్తున్నాం. ‘నీట్ పరీక్ష పత్రం లీక్” అవడం వల్ల ఎందరో విద్యార్థులు తీవ్రంగా నష్టపోయారు. కొందరు ఆందోళనతో ఆత్మహత్య చేసుకున్నారు. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా లక్షలాది విద్యార్థులు ఆందోళనబాట పట్టారు. ముఖ్యంగా కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో దఫదఫాలుగా నిరసన కార్యక్రమాలు, ధర్నాలు, సత్యాగ్రహం వంటి కార్యక్రమాలు చేపట్టారు. నీట్ లీకేజీలో దోషులను కఠినంగా శిక్షించాలని, కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని వివిధ ప్రతిపక్ష పార్టీలు, నేతలు, మేధావులు, నిపుణులు, అభ్యుదయ, ప్రజాస్వామ్యవాదులు డిమాండ్ చేశారు. ఈ ఉద్యమం పెను ఉప్పెనగా మారి ఢిల్లీ వీధుల్లోకి చేరింది.
జంతర్‌మంతర్ వద్ద ప్రముఖ విద్యావేత్త సోనమ్ వాంగ్‌చుక్ ఆమరణ నిరాహార దీక్ష, సీజేపీ, వివిధ పార్టీలు, సంఘాల ఆధ్వర్యంలో జరిగిన ఆందోళనలతో హస్తిన అట్టుడుకుతున్నది. చలో పార్లమెంటు కార్యక్రమం ఉద్రిక్తంగా మారింది. ప్రభుత్వం మొండి పట్టుదలతో అణచివేత చర్యలు తీసుకోవడంతో ఎందరో విద్యార్థులు లాఠీ దెబ్బలు, పోలీసుల దౌర్జన్యంతో గాయాలపాలయ్యారు. దీనికంతటికీ ప్రధాని అహమే కదా కారణం.
అమెరికా అధ్యక్షుడు తన విధానాలతో రెండో సారి అధ్యక్ష పీఠం ఎక్కిన తర్వాత ఎవరినీ సంప్రదించకుండా ఒంటెత్తు పోకడలతో అహం, దుందుడుకు నిర్ణయాలతో తన దేశ ప్రజలతోపాటు మొత్తం ప్రపంచ దేశాల ప్రజలను ప్రమాదంలో పడేస్తున్నాడు. ముందుగా అధిక సుంకాలు, ప్రతీకార సుంకాలు విధిస్తూ ఏకపక్షంగా నిర్ణయం తీసుకొని ప్రపంచ దేశాలకు శత్రువుగా మారాడు. తన ఇగో కారణంగా తనతో పాటు పయనించిన మిత్రుడు ఎలన్ మస్క్ దూరమయ్యాడు. అమెరికా ప్రజలే ‘నో కింగ్స్” పేరిట ఉద్యమిస్తున్నారు. అమెరికాతో దాదాపు అన్ని దేశాల వాణిజ్య, రాజకీయ, సామాజిక, దౌత్య సంబంధాలు సన్నగిల్లాయి. మరోవైపు రష్యా- ఉక్రెయిన్ యుద్ధానికి కూడా నాయకుల ఇగోలే కారణం.
రాష్ట్రం, దేశం, అంతర్జాతీయ స్థాయిలోనైనా ప్రస్తుత అనేక సమస్యలకు కారణం నాయకులు, పాలకుల ఇగోలే. ఆధిపత్య, నియంతృత్వ ధోరణి సమస్యలకు అసలు కారణం. ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే పద్ధతి ఉంటుందనే వాస్తవాన్ని విస్మరించకూడదు. ఇది ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు. ప్రపంచ దేశాలు రాజరికపు విధానాలు, సామ్రాజ్యవాద, నియంతృత్వ విధానాలకు వ్యతిరేకంగా పోరాడి స్వాతంత్య్రం సాధించుకొన్న దేశాలే. మరి నేడు ఆ మూలాలు మరచి, స్వదేశీ, విదేశీ ప్రజలపై నియంతృత్వ, ఆధిపత్య ధోరణితో, ఇగోలతో పరిపాలన సాగిస్తే ఎలా? ఇకనైనా పాలకులు మారాలి. పాలన ప్రజాస్వామ్యంగా ఉండాలి. సమస్యల పరిష్కారానికి చర్చలే మార్గం అని గుర్తించాలి. ప్రజాస్వామ్య ముసుగులో సాగుతున్న నియంతృత్వ ధోరణి విడనాడాలి. లేకపోతే ప్రజాగ్రహానికి గురికావడం ఖాయం.