PM Modi : ప్రధాని (Prime Minister) నరేంద్రమోదీ (Narendra Modi) ఆదివారం మధ్యాహ్నం ఇరాన్ అధ్యక్షుడి (Iran president) తో ఫోన్లో మాట్లాడారు. ఇజ్రాయెల్-ఇరాన్ (Israel vs Iran) దేశాల మధ్య ఉద్రిక్తతలు, ఇరాన్లో ప్రస్తుత పరిస్థితిపై వారు చర్చించారు. ఈ విషయాన్ని ప్రధాని మోదీ తన ఎక్స్ ఖాతా ద్వారా వెల్లడించారు.
‘ఇరాన్లో ప్రస్తుత పరిస్థితిపై మేం వివరంగా చర్చించాం. ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు ఇటీవల మరింత తీవ్రం కావడంపై తీవ్ర ఆందోళన వ్యక్తంచేశాను. ఉద్రిక్తతలను తగ్గించుకునేందుకు ఇరుదేశాలు ప్రయత్నించాలని సూచించాను. ఇరుదేశాల్లో శాంతి, భద్రత, స్థిరత్వాన్ని సాధ్యమైనంత త్వరగా పునరుద్ధరించడం కోసం చర్చలు, దౌత్య మార్గాల ద్వారా ముందుకు వెళ్లాలని సలహా ఇచ్చాను’ అని ప్రధాని వెల్లడించారు.
కాగా ఇజ్రాయెల్-ఇరాన్ దేశాల మధ్య ఉద్రిక్తతలు అంతకంతకే పెరుగుతున్నాయి. ఇవాళ ఇజ్రాయెల్ తరఫున అమెరికా కూడా యుద్ధంలోకి దిగడంతో అగ్నికి ఆజ్యం పోసినట్లయ్యింది. అయితే అమెరికా తమపై ప్రత్యక్ష దాడికి దిగడంపై ఇరాన్ ఆగ్రహం వ్యక్తంచేసింది. తమపై దాడులు చేస్తున్న అమెరికా తగిన మూల్యం చెల్లించాల్సి వస్తుందని హెచ్చరించింది.