High alert : పశ్చిమాసియాలో ఇరాన్-ఇజ్రాయెల్ (Iran vs Israel) యుద్ధం తీవ్రరూపం దాల్చింది. ఇజ్రాయెల్‌కు మద్దతుగా అమెరికా కూడా యుద్ధంలోకి దిగడంతో ఉద్రిక్తతలు ఒక్కసారిగా పెరిగాయి. ‘అమెరికా దాడులు మొదలు పెట్టింది.. ఇక మేం ముగింపు ఇస్తాం’ అని ఇరాన్ తాజాగా హెచ్చరిక చేసింది. ఈ క్రమంలో ఇరాన్ ప్రతీకార చర్యలకు దిగే ఛాన్స్ ఉందనే అనుమానం ఉన్న పలు ప్రాంతాల్లో అమెరికా పాలకులు హైఅలర్ట్ (High alert) ప్రకటించారు.
కాగా ఇరాన్‌లోని మూడు అణు కేంద్రాలపై అమెరికా ఆదివారం ప్రత్యక్ష దాడులు చేసింది. ఈ నేపథ్యంలో అగ్రరాజ్యం పలు నగరాల్లో హై అలర్ట్ ప్రకటించింది. అమెరికా దాడులకు ప్రతిగా టెహ్రాన్ ఎలాంటి చర్యలకు దిగుతుందనే ఆందోళన సర్వత్రా నెలకొంది. ఈ క్రమంలో అమెరికా అప్రమత్తమైంది. పౌరులకు ఎలాంటి హాని జరగకుండా ఉండేందుకు ముందుగానే జాగ్రత్త పడుతోంది.
అందులో భాగంగా ప్రార్థనా స్థలాలు, సున్నితమైన ప్రాంతాల్లో నిఘాను పటిష్ఠం చేసింది. వాషింగ్టన్ సహా పలు నగరాల్లో హైఅలర్ట్ ప్రకటించింది. ఇరాన్లో దాడుల నేపథ్యంలో పరిస్థితిని పర్యవేక్షిస్తున్నట్లు న్యూయార్క్ పోలీస్ అధికారులు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. మతపరమైన ప్రదేశాలు, సాంస్కృతిక, దౌత్య ప్రాంతాల్లో భద్రతాపరమైన చర్యలు చేపట్టారు.