Iran vs Israel : ఇరాన్ (Iran) లోని ఫోర్డో, నతాంజ్, ఇస్ఫాహన్ అణు కేంద్రాలపై భారీ దాడులకు పాల్పడినట్లు అమెరికా అధ్యక్షుడు (US President) డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ఇటీవల ప్రకటించారు. ఈ దాడులకు ప్రతీకారంగా ఇరాన్ పశ్చిమాసియాలోని అమెరికా పౌరులు, సైనిక సిబ్బందిని లక్ష్యంగా చేసుకుంటున్నది. ఈ విషయాన్ని ఇరాన్ అధికారిక మీడియా వెల్లడించింది.
ఈ దాడులను అమెరికా అధ్యక్షుడు ప్రారంభించారని, తాము అంతం చేస్తామని ఇరాన్ హెచ్చరించింది. ఇరాన్ గగనతల నిబంధనలను ఉల్లంఘించి అమెరికా అతిపెద్ద నేరం చేసిందని, ఇకపై అక్కడి వారికి పశ్చిమాసియాలో స్థానం లేదని తెలిపింది. పశ్చిమాసియాలో ఉన్న యూఎస్ స్థావరాలను లక్ష్యంగా చేసుకుంటామని పేర్కొంటూ వాటికి సంబంధించిన గ్రాఫిక్స్‌ను మీడియా ఛానెల్ ప్రసారం చేసింది.
ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధంలో సహకారంపై రెండు వారాల్లో నిర్ణయం తీసుకుంటానని ప్రకటించిన రెండు రోజుల్లోనే ట్రంప్ ఇరాన్‌పై దాడులు చేశారు. అమెరికా భారీ బాంబులు ఫోర్డోపై వేసిందని, ఇరాన్ గగనతలం బయట నుంచే ఈ దాడులు చేశామని బాంబు దాడుల అనంతరం ట్రంప్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ఇజ్రాయెల్, అమెరికా చరిత్రలో ఇది చాలా ముఖ్యమైన పరిణామమని తెలిపారు. తమ దాడులతో ఇరాన్ యుద్ధానికి ముగింపు పలకాల్సిన పరిస్థితి వచ్చిందని పేర్కొన్నారు.
మరోవైపు ఇరాన్‌పై దాడులకు ప్రతిగా తాము ఎర్ర సముద్రంలోని అమెరికా నౌకలను లక్ష్యంగా చేసుకుంటామని హౌతీలు ట్రంప్‌ను హెచ్చరించారు. దాంతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత తీవ్రమయ్యే అవకాశం ఉంది.