Iran vs Israel : ఇజ్రాయెల్-ఇరాన్ (Israel vs Iran) మధ్య పోరు ఉధృతంగా సాగుతోంది. రెండు దేశాల నడుమ దాడులు, ప్రతిదాడులతో పశ్చిమాసియాలో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఇంతలో ఇజ్రాయెల్‌కు మద్దతుగా అమెరికా (US) రంగంలోకి దిగడం ఈ ఉద్రిక్తతలకు మరింత ఆజ్యం పోసింది. ప్రస్తుతం ఇజ్రాయెల్‌లోని పలు ప్రాంతాలే లక్ష్యంగా ఇరాన్ క్షిపణుల (Missiles) తో విరుచుకుపడుతోంది.
ఇరాన్‌లోని అణుకేంద్రాలపై అమెరికా ప్రత్యక్ష దాడులు చేసిన కొన్ని గంటలకే టెహ్రాన్ ఈ విధంగా స్పందించింది. ఇరాన్ దాడులను ఇజ్రాయెల్ సైనిక దళాలు కూడా ధ్రువీకరించాయి. ఇరాన్ క్షిపణులు తమ దేశంపైకి దూసుకొస్తున్నాయని పేర్కొ్న్నాయి. ఆ క్షిపణులను అడ్డుకునేందుకు తాము ప్రయత్నిస్తున్నామని వెల్లడించాయి.
ఇరాన్ దాడులతో ఇజ్రాయెల్ రాజధాని టెల్ అవీవ్, జెరూసలెంతోపాటు పలు ప్రాంతాల్లో భారీ పేలుళ్లు వినిపించాయి. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ తన ప్రజలకు కీలక హెచ్చరికలు జారీ చేసింది. క్షిపణులు దూసుకొస్తున్నందున పౌరులు సురక్షిత ప్రాంతాలకు తరలిపోవాలని సూచించింది. స్థానిక అధికారుల సూచనలను పాటించాలని, తదుపరి ఆదేశం వరకు అక్కడే ఉండాలని పేర్కొంది.