Pumpkin Seeds | మారిన మన జీవనశైలి కారణంగా మనలో చాలా మంది వెన్నునొప్పితో బాధపడుతున్నారు. ఎక్కువ సమయం కూర్చొని పని చేయడం, ట్రాఫిక్ లో ఎక్కువ సమయం వేచి ఉండడం, సరైన వ్యాయామం చేయకపోవడం వంటి వివిధ కారణాల వల్ల మనలో చాలా మంది వెన్నునొప్పితో బాధపడుతున్నారు. వయసుతో సంబంధం లేకుండా అందరూ ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు. ఈ సమస్య కారణంగా చాలా మంది బలహీనంగా తయారవుతున్నారు. వెన్నునొప్పి సమస్యకు వైద్య చికిత్స అవసరమే అయినప్పటికీ కొన్నిసార్లు సరైన ఆహారాన్ని తీసుకోవడం ద్వారా కూడా మనం ఈ సమస్య నుండి బయటపడవచ్చు. వెన్నునొప్పితో బాధపడే వారు ఆహారంలో గుమ్మడి గింజలను చేర్చుకోవడం ద్వారా ఈ సమస్య నుండి బయటపడవచ్చని వైద్యులు చెబుతున్నారు. వెన్నునొప్పిని తగ్గించడంలో గుమ్మడి గింజలు ప్రభావవంతంగా పని చేస్తాయని వీటిని తీసుకోవడం వల్ల వెన్నునొప్పి సమస్య నుండి సులభంగా బయటపడవచ్చని వారు తెలియజేస్తున్నారు. వెన్నునొప్పిని తగ్గించడంలో గుమ్మడి గింజలు ఏ విధంగా మనకు సహాయపడతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
గుమ్మడి గింజలల్లో మెగ్నీషియం ఎక్కువగా ఉంటుంది. కండరాలు, నరాలను శాంతపరిచే స్వభావం కలిగి ఉంటుందని మెగ్నీషియంను రిలాక్సేషన్ మినరల్ అని కూడా పిలుస్తారు. గుమ్మడి గింజలను తీసుకోవడం వల్ల మనకు తగినంత మెగ్నీషియం లభిస్తుంది. దీంతో కండరాల ఉద్రిక్తత తగ్గి నడుము దిగువ భాగంలో అసౌకర్యం తగ్గుతుంది. అలాగే దీర్ఘకాలిక వాపు కూడా నడుము నొప్పిని కలిగిస్తుంది. గుమ్మడిగింజల్లో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలో మంటను, వాపును తగ్గించడంలో మనకు సహాయపడతాయి. వాపు తగ్గడం వల్ల నొప్పి, అసౌకర్యం వంటివి కూడా తగ్గుతాయి. గుమ్మడి గింజలు ఒమెగా 3 ఫ్యాటీ ఆమ్లాలను కలిగి ఉంటాయి. ఈ ఆమ్లాలు వాటి శోథ నిరోధక లక్షణాలకు ప్రసిద్ది చెందాయి. ఈ కొవ్వులు కీళ్లను దృఢంగా చేయడంతో పాటు వాపు, నొప్పి వంటి సమస్యలను కూడా తగ్గిస్తాయి. కనుక నడుము నొప్పితో బాధపడే వారు ఈ గింజలను తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
గుమ్మడి గింజల్లో విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల మొత్తం ఆరోగ్యానికి మేలు కలుగుతుంది. కణజాలం కూడా బలంగా తయారవుతుంది. ఇక కండరాలు బలంగా తయారవ్వడానికి, కండరాల మరమ్మత్తుకు ప్రోటీన్ చాలా ముఖ్యమైంది. గుమ్మడి గింజలు మొక్క ఆధారిత ప్రోటీన్ ను మనకు అందిస్తాయి. వీటిని తీసుకోవడం వల్ల వెన్నెముక బలంగా తయారవ్వడంతో పాటు కండరాల మరమ్మత్తు కూడా సక్రమంగా జరుగుతుంది. కొన్నిసార్లు ఇన్పెక్షన్ లు కూడా వెన్నునొప్పికి కారణమవుతాయి. గుమ్మడి గింజల్లో జింక్ అధికంగా ఉంటుంది. వీటిని తినడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. దీంతో ఇన్పెక్షన్ లు మన దరి చేరకుండా ఉంటాయి. ఈ విధంగా గుమ్మడి గింజలు వెన్ను నొప్పిని తగ్గించడంలో మనకు ఎంతో సహాయపడతాయని వైద్యులు చెబుతున్నారు. వీటిని రోజూ గుప్పెడు మోతాదులో తీసుకోవడం వల్ల వెన్నునొప్పి తగ్గడంతో పాటు మొత్తం ఆరోగ్యానికి మేలు కలుగుతుంది. వీటిని నేరుగా పచ్చిగా తీసుకోవచ్చు. అలాగే పెరుగు, ఓట్ మీల్, సలాడ్ వంటి వాటిపై చల్లుకుని తీసుకోవచ్చు.