ECI : కేంద్ర ఎన్నికల సంఘం (Election Commission of India) ఆదివారం ప్రెస్ మీట్ (Press meet) నిర్వహించనుంది. ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు దేశ రాజధాని ఢిల్లీ (Delhi) లోని నేషనల్ మీడియా సెంటర్ (National Media Centre) లో ఈ ప్రెస్‌మీట్ జరగనుంది. ఎన్నికల సంఘం అధికార బీజేపీకి అనుకూలంగా ఓట్ల చోరీకి పాల్పడుతున్నదని ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో ఈసీ ప్రెస్ మీట్ నిర్వహించడం ప్రాధాన్యం సంతరించుకుంది.
ఈ ప్రెస్మీట్లో రాహుల్‌గాంధీ ఆరోపణలకు ఈసీ సమాధానం ఇచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా తాజా రాజకీయ పరిణామాలపై కూడా ఈసీ బ్రీఫింగ్ ఇవ్వనుంది. కాగా బీహార్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఈసీ అక్కడ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) పేరుతో ఓటర్ల జాబితాను సవరించింది. దీనిపై కాంగ్రెస్ సహా విపక్షాలన్ని విమర్శలు గుప్పిస్తున్నాయి.
ఏ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల జరిగినా అక్కడ అధికార బీజేపీకి తోడ్పడేలా ఎన్నికల సంఘం ఓటర్ల జాబితాల్లో అవకతవకలకు పాల్పడుతోందని ఆరోపిస్తున్నాయి. మహారాష్ట్ర, కర్ణాటక, హర్యానా ఎన్నికల సందర్భంగా కూడా ఈసీ ఓటర్ల జాబితాలో అక్రమాలకు పాల్పడిందని రాహుల్‌గాంధీ ఆరోపించారు. తాజాగా బీహార్‌లో కూడా అదే పనిచేశారని విమర్శించారు. ఈ నేపథ్యంలో ఆదివారం ఈసీ ప్రెస్ మీట్ నిర్వహిస్తుండటం ఆసక్తికరంగా మారింది.