Strike : వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తూ సిబ్బంది సమ్మెకు దిగడంతో ఎయిర్ కెనడా విమాన సర్వీసులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. సమ్మె నోటీసు గడువు నేటితో ముగియడంతో సిబ్బంది సమ్మెకు దిగారు. దాంతో ఎయిర్ కెనడా, అనుబంధ సంస్థ ఎయిర్ కెనడా రూజ్ సర్వీసులు నిలిచిపోయాయి. సమ్మెకారణంగా తమ కార్యకలాపాలను నిలిపివేస్తున్నామని ఎయిర్ కెనడా ప్రకటించింది.
అయితే థర్డ్ పార్టీ నిర్వహిస్తున్న ఎయిర్ కెనడా ఎక్స్‌ప్రెస్ సేవలు మాత్రం కొనసాగుతాయని ఆ సంస్థ తెలిపింది. అయితే సిబ్బంది సమ్మె కారణంగా రోజుకు 1.3 లక్షల మంది ప్రయాణికులపై ప్రభావం పడనుంది. కెనడాలో అతిపెద్ద విమానయాన సంస్థగా ఉన్న ఎయిర్ కెనడా నిత్యం 700 సర్వీసులు నడిపిస్తోంది. అందులో 10 వేల మంది ఫ్లైట్ అటెండెంట్లు పనిచేస్తున్నారు. విమాన ప్రయాణ సమయంలో ప్రయాణికుల భద్రత, సౌకర్యాలకు వీరిదే బాధ్యత.
అయితే వేతనాల పెంపునకు సంబంధించి కెనడియన్ యూనియన్ ఆఫ్ పబ్లిక్ ఎంప్లాయీస్ (CUPE) ఆగస్టు 13న మూడు రోజుల సమ్మె నోటీసులు ఇచ్చింది. నేటితో నోటీసు గడువు ముగిసింది. అయినా ఇప్పటికీ ఒప్పందం కుదరకపోవడంతో సమ్మె ప్రారంభమైనట్లు సిబ్బంది యూనియన్ ప్రకటించింది. దాంతో ప్రపంచవ్యాప్తంగా సేవలందిస్తున్న దాదాపు 700 ఎయిర్ కెనడా విమానాలు గ్రౌండ్‌కే పరిమితమయ్యాయి.
సమ్మె నేపథ్యంలో సర్వీసులను క్రమంగా రద్దు చేస్తున్నామని, శనివారం నాటికి పూర్తిగా నిలిపివేస్తామని ఎయిర్ కెనడా ముందస్తుగా ప్రకటించింది. ఈ క్రమంలోనే నేడు అన్ని సర్వీసులను నిలిపివేస్తున్నట్లు ప్రకటన చేసింది. ఈ విమానాల నిలిపివేత విదేశీ ప్రయాణాలపై అధికంగా ప్రభావం చూపనుంది. రద్దయిన విమానాల టికెట్లు కొనుగోలు చేసిన ప్రయాణికులు పూర్తి రుసుము వాపస్ చేస్తామని ఎయిర్ కెనడా తెలిపింది. వీలైనంత వరకు ఇతర విమానయాన సంస్థలతో మాట్లాడి ప్రయాణికులను సర్దుబాటు చేసేందుకు ప్రయత్నిస్తున్నామని ఎయిర్ కెనడా అధికారులు చెప్పారు.