సినిమా పేరు: ఉస్తాద్ భగత్‌సింగ్
తారాగణం: పవన్‌కల్యాణ్, శ్రీలీల, రాశీఖన్నా, కె.ఎస్.రవికుమార్, పార్దీబన్, రావురమేష్..
దర్శకత్వం: హరీశ్‌శంకర్
సంగీతం: దేవిశ్రీప్రసాద్, తమన్
నిర్మాణం: మైత్రీ మూవీమేకర్స్
పవన్‌కల్యాణ్ సినిమా అంటే అంచనాలు సర్వసాధారణం. అందునా ‘ఓజీ’ వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత వస్తున్న సినిమా.. పైగా ‘గబ్బర్‌సింగ్’ వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత హరీశ్‌శంకర్ దర్శకత్వంలో పవన్‌కల్యాణ్ నటించిన సినిమా కావడంతో అనౌన్స్మెంట్ నుంచి ఆడియన్స్‌లో సినిమాపై క్యూరియాసిటీ హెచ్చుగానే ఉంది. మైత్రీ మూవీమేకర్స్ నిర్మాణ విలువలు, ప్రమోషన్లో భాగంగా విడుదల చేసిన ప్రచారచిత్రాలు అన్నీ సినిమాపై అంచనాలు మరింత పెంచాయి. ఇన్ని ఎక్స్పెక్టేషన్స్ మధ్య ఈ గురువారం ఎట్టకేలకు ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ విడుదలైంది. మరి అందరి అంచనాలనూ ఉస్తాద్ అందుకున్నాడా? అనే ప్రశ్నకు సమాధానం తెలుసుకోవాలంటే ముందు కథలోకి వెళ్లాలి.
కథ
చదలమర్రి నల్లనాగప్ప(పార్దీబన్) పరమ దుర్మార్గుడు. ఎలాగైనా ముఖ్యమంత్రి కావాలనేది అతని లక్ష్యం. దానికోసం ఎంతకైనా తెగిస్తాడు. ఇందులో భాగంగా తనకు అడ్డున్న రాష్ట్ర ముఖ్యమంత్రిపై హత్యాప్రయత్నం చేస్తాడు. తీవ్రగాయాల పాలై, కొన ఊపిరితో ఉన్న ముఖ్యమంత్రి, హాస్పిటల్ ఇంటెన్సీవ్ కేర్‌లో ప్రాణాపాయ స్థితిలో ఉంటాడు. దాంతో అదే పార్టీలోని మరో సీనియర్ నేతని అపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఎన్నుకుంటారు. అతన్ని కూడా నల్లనాగప్ప హత్య చేయిస్తాడు. దాంతో పార్టీలో మూడో స్థానంలో ఉన్న నల్లనాగప్ప ముఖ్యమంత్రి అవుతాడు. అతని కొడుకు (కిల్లి క్రాంతి) తండ్రిలాగే రాక్షసుడు. ఎంజాయ్మెంట్ కోసం తలకోన ఫారెస్ట్‌కి వెళ్తాడు. అక్కడి పోలీసులు వందల టన్నుల గంజాయిని సీజ్ చేశారని తెలిసి, గంజాయి కావాలంటూ.. అక్కడి పోలీస్ స్టేషన్‌పై దాడి చేస్తాడు. పోలీసుల్ని, వాళ్ల కుటుంబీకుల్నీ చిత్రహింసలు పెడుతుంటాడు. అప్పుడొస్తాడు ఉస్తాద్ భగత్‌సింగ్ (పవన్‌కల్యాణ్). ముఖ్యమంత్రి కొడుకుని, అతని మనుషుల్ని ఓ రేంజ్లో ఆడుకుంటాడు. కొంతమందినైతే నిర్ధాక్షిణ్యంగా చంపేస్తాడు. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి కొడుకుని కిడ్నాప్ చేస్తాడు. తన కొడుకు ఆచూకీ తెలియకపోవడంతో.. పాతబస్తీలో ఉండే ఉగ్రవాదుల్ని ఆశ్రయిస్తాడు ముఖ్యమంత్రి. ఉగ్రవాదులు.. ముఖ్యమంత్రి కొడుకుని వెతుక్కుంటూ అడవిలోకి వస్తారు. వచ్చినవాళ్లను వచ్చినట్టే అందర్నీ చంపేస్తాడు ఉస్తాద్ భగత్‌సింగ్. ఇంతకీ ఎవరీ ఉస్తాద్ భగత్‌సింగ్? ముఖ్యమంత్రి కొడుకుని ఎందుకు కిడ్నాప్ చేశాడు? ముఖ్యమంత్రికీ ఉగ్రవాదులకూ సంబంధం ఏంటి? ఈ ప్రశ్నలకు సమాధానమే అసలు కథ.
విశ్లేషణ
నిజానికి పరమ రొటీన్ కథ ఇది. అయితే.. ఇలాంటి మాస్ సబ్జెక్ట్‌ని సదరు హీరో అభిమానులకు నచ్చేలా, ఎక్కడా విసుగులేకుండా తీయగలిగితే సినిమా హిట్టే. దర్శకుడు హరీశ్‌శంకర్ ఆ విషయంలో విజయం సాధించాడనే చెప్పాలి. పవన్‌కల్యాణ్ అభిమానులు పండుగ చేసుకునేలా సినిమాను తీర్చిదిద్దాడు హరీశ్ శంకర్. ముఖ్యంగా పవన్ కోసం రాసుకున్న కొన్ని డైలాగులు అభిమానులకే కాదు, సగటు ప్రేక్షకుడికి కూడా గూజ్బంప్స్ తెప్పిస్తాయి. పవన్‌కల్యాణ్ పాత్రకు ఇచ్చిన ఎలివేషన్స్ కానీ, ఆ పాత్ర ప్రవర్తన కానీ, ఆ పాత్ర వాడే భాష.. ఇవన్నీ జనాలకు నచ్చేస్తాయి. ప్రథమార్ధం అంతా ప్రశ్నలతోనే ముగించాడు హరీశ్‌శంకర్. ద్వితీయార్ధం మొదలైనప్పట్నుంచీ ఒక్కో చిక్కుముడిని విప్పుకుంటూ, సమాధానాలిచ్చుకుంటూ ఆసక్తికరంగా కథను నడిపాడు. అందుకే.. ప్రథమార్ధం కాస్త సోసోగా అనిపించినా.. ద్వితాయార్ధం మాత్రం స్పీడ్‌గా జనరంజకంగా అనిపిస్తుంది. ముఖ్యంగా ద్వితీయార్ధంలో శ్రీలీల ఎపిసోడ్‌ని ఆడియన్స్ బాగా ఎంజాయ్ చేస్తారు. ఈ ఎపిసోడ్లో అంతా వింటేజ్ పవన్‌ని చూస్తారు. పవన్ పాత సినిమాను గుర్తు చేస్తూ అభిమానులకు నచ్చేలా సినిమాను తీశాడు హరీశ్ శంకర్. ‘తొలిప్రేమ’లోని ‘నీ మనసే..’ పాటను ఈ సినిమాకోసం మళ్లీ వాడేశాడు. ఈ పాట పిక్చరైజేషన్ కూడా బావుంది. అయితే.. అక్కడక్కడ కామెడీ కోసం పెట్టిన కొన్ని సన్నివేశాలు పంటికింద రాళలాగా ఇబ్బంది పెడతాయి. మొత్తంగా ‘ఉస్తాద్ భగత్‌సింగ్ ’ పైసా వసూల్ సినిమా అని చెప్పొచ్చు.
నటీనటులు
పవన్‌కల్యాణ్ గురించి చెప్పేదేముంది? ఇలాంటి పాత్రలు చేయడంలో అతను మాస్టర్ అని ‘గబ్బర్‌సింగ్’తోనే రుజువు అయింది. ఈ సినిమాలోనూ అదే జోష్‌తో అలరించారు పవన్‌కల్యాణ్. ఓ విధంగా సినిమా వన్‌మ్యాన్ షో. ఒంటిచేత్తో సినిమాను మోశారు పవన్‌కల్యాణ్. హీరోయిన్లలో శ్రీలీల పాత్ర కథలో చాలా కీలకం. అనుకున్నట్టే తను చాలా బాగా చేసింది. ఇక పార్తీబన్, రావురమేష్, కె.ఎస్.రవికుమార్ అంతా పరిధిమేర పాత్రలన రక్తికట్టించారు.
సాంకేతికంగా
కథ పాతదే. దాన్ని హరీష్ కొత్తగా నడిపించిన విధానం బావుంది. ముఖ్యంగా హరీశ్‌శంకర్ డైలాగులు ఈ సినిమాకు హైలైట్. అద్భుతమైన అర్థవంతమైన సంభాషణలతో అందర్నీ ఆకట్టుకున్నారాయన. ఇక తమన్ నేపథ్య సంగీతం, దేవిశ్రీ పాటలు సినిమాకు బలాన్నిచ్చాయి. కెమెరా వర్క్ కూడా బావుంది. మొత్తంగా అభిమానులకే కాక, సామాన్య మాస్ ప్రేక్షకుడికి కూడా ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ నచ్చే అవకాశం ఉంది.
బలాలు
పవన్‌కల్యాణ్ నటన, హరీశ్‌శంకర్ సంభాషణలు, స్క్రీన్‌ప్లే,
బలహీనతలు
కథ, ఫస్టాఫ్ కాస్త స్లో అవ్వడం, కొన్ని కామెడీ సీన్స్
రేటింగ్ 3/5