Heart attacks : కరోనా మహమ్మారి (Corona Virus) వచ్చిపోయిన తర్వాత దేశంలో గుండెపోటు మరణాలు పెరిగిపోయాయి. కరోనా వ్యాక్సిన్ (Corona vaccine) లే ఇందుకు ప్రధాన కారణమనే వాదనలు వినిపిస్తున్నాయి. కానీ కొందరు మాత్రం వ్యాక్సిన్లు కారణం కాదని అంటున్నారు. ఈ నేపథ్యంలో హర్యానా (Haryana) లో గత ఆరేళ్లలో సంభవించిన గుండెపోటు మరణాల (Heart attack deaths) సంఖ్య ఆందోళన కలిగిస్తోంది. గడిచిన ఆరేళ్లలో 18-45 ఏళ్ల వయసువాళ్లు దాదాపుగా 18వేల మంది హార్ట్ఎటాక్తో మరణించినట్టు అసెంబ్లీ వేదికగా హర్యానా సర్కారు ప్రకటించింది.
యువతలో గుండెపోటు కారణంగా సంభవించిన మరణాలపై అసెంబ్లీలో కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రశ్నించారు. 2020 జనవరి నుంచి 2026 జనవరి వరకు ఏ జిల్లా నుంచి ఎంతమంది, ఏ వయసు వారు గుండెపోటుతో మరణించారో తెలుపాలని ఎమ్మెల్యే అడిగారు. ఆ మరణాలకు కరోనా వైరస్‌తో, కొవిడ్ వ్యాక్సినేషన్‌తో ఏమైనా సంబంధం ఉందా..? ఆ దిశగా ఏమైనా సర్వే చేపట్టారా..? అని ప్రశ్నించారు. దాంతో అలాంటి సర్వే నిర్వహించలేదని ప్రభుత్వం సమాధానమిచ్చింది. కాకపోతే జిల్లాల వారీగా సేకరించిన సమాచారాన్ని ఇచ్చింది.
2020లో 2,394 మంది, 2021లో 3,188 మంది, 2022లో 2,796 మంది, 2023లో 2,886 మంది, 2024లో 3,063 మంది, 2025లో 3,255 మంది, 2026 జనవరిలో 391 మంది, ఇలా మొత్తంగా 17,973 మంది హార్ట్ఎటాక్తో మరణించినట్లు ప్రభుత్వం తెలిపింది. యమునానగర్ జిల్లాలో అత్యధికంగా, రోహ్తక్ జిల్లాలో అన్నింటికంటే తక్కువగా ఈ మరణాల సంఖ్య ఉందని ప్రభుత్వం పేర్కొన్నది.