– ఆరుతడి పంటలు, ఆయిల్ పామ్ సాగుపై రైతులకు అవగాహన కల్పించాలి
– జలసిరి ద్వారా భూగర్భ జలాల సంరక్షణ చర్యలు చేపట్టాలి
జూలూరుపాడు, జూలై 28 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు ఎంపీడీవో కార్యాలయ సమావేశ మందిరంలో ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు మండల స్థాయిలో నిర్వహించే సాధారణ సమావేశాలలో భాగంగా మంగళవారం ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశానికి జిల్లా కలెక్టర్ అంకిత్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మండలంలోని 23 గ్రామ పంచాయతీలలో వివిధ శాఖల ద్వారా జరుగుతున్న అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాల అమలు, సమగ్ర అభివృద్ధి ప్రణాళికలపై అధికారులు, సర్పంచులతో కలెక్టర్ సమగ్రంగా సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అంకిత్ మాట్లాడుతూ… జిల్లాలో గత ఏడాదితో పోలిస్తే సుమారు 40 మిల్లీమీటర్ల లోటు వర్షపాతం నమోదైందని తెలిపారు. సుమారు 25 ఏళ్ల తర్వాత ఎల్ నినో ప్రభావం వల్ల ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయని, ఈ పరిస్థితులను తట్టుకునేందుకు వ్యవసాయ, నీటిపారుదల, పశుసంవర్ధక, విద్యా శాఖలు సమన్వయంతో ముందస్తు ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు.
జిల్లాలో 42 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం, 70 వేల మెట్రిక్ టన్నుల మొక్కజొన్న కొనుగోలు గత ఏడాది చేసినట్లు కలెక్టర్ తెలిపారు. నీటి కొరతను అధిగమించేందుకు రైతులు వరి స్థానంలో ఆయిల్ పామ్, మొక్కజొన్న, పప్పుధాన్యాలు మరియు ఇతర ఆరుతడి పంటల వైపు దృష్టి సారించాలని సూచించారు. ముఖ్యంగా ఆయిల్ పామ్ సాగుతో 25 ఏళ్ల పాటు స్థిరమైన ఆదాయం లభిస్తుందన్నారు. మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్న పత్తి, కూరగాయల సాగును ప్రోత్సహించేలా వ్యవసాయ శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో రైతులకు అవగాహన కల్పించాలని దిశానిర్దేశం చేశారు. భూగర్భ జల మట్టాలను పెంచేందుకు జలసిరి కార్యక్రమం కింద ప్రతి ఇంట్లో ఇంకుడు గుంతలు, అలాగే పర్కొలేషన్ ట్యాంకులు, ఫారం పాండ్లు నిర్మించేలా పంచాయతీ కార్యదర్శులు, సర్పంచులు కృషి చేయాలని కలెక్టర్ ఆదేశించారు.
విద్యార్థులకు, అంగన్వాడీ కేంద్రాల పిల్లలకు ప్రభుత్వ సౌకర్యాలు సంపూర్ణంగా అందేలా చర్యలు తీసుకోవాలన్నారు . ఈ సమావేశానికి హాజరైన జడ్పీ సీఈఓ నాగలక్ష్మి మాట్లాడుతూ.. జూలూరుపాడు మండలానికి 99 ఫారం పాండ్ల నిర్మాణం లక్ష్యంగా నిర్దేశించగా, ఇప్పటివరకు 29 ప్రాంతాలను గుర్తించినట్లు తెలిపారు. ప్రతి గ్రామ పంచాయతీలో కనీసం 4 ఫారం పాండ్లు నిర్మించాల్సి ఉండగా గాంధీనగర్, గుండ్లరేవు, కాకర్ల, కొత్తూరు, దండు మిట్ట తండా గ్రామాల్లో ఇప్పటివరకు స్థల గుర్తింపు జరగలేదని, ఆయా గ్రామాలకు ప్రాధాన్యమిచ్చి పనులు వేగవంతం చేస్తామని వివరించారు. ఈ సమావేశంలో తాసీల్దార్ శ్రీనివాస్, ఎంపీడీఓ తాళ్లూరు రవి, మండల ప్రత్యేక అధికారి శైలజ, మండలంలోని పలు శాఖల అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

ఎల్ నినో ను తట్టుకునేలా ముందస్తు ప్రణాళికలు : కలెక్టర్ అంకిత్