Ali Larijani : ఇరాన్ (Iran) కీలక వ్యూహకర్త, అగ్రశ్రేణి నాయకుడు అలీ లారిజానీ (Ali Larijani) తన బిడ్డింటికి పోవడమే అతని పాలిట శాపమైంది. అప్పటికే అతడిని టార్గెట్ చేసి నిఘా పెట్టిన ఇజ్రాయెల్ (Israel) అదే అదనుగా హతమార్చింది. టెహ్రాన్ (Tehran) శివార్లలోని తన కుమార్తె నివాసానికి లారిజానీ రహస్యంగా వెళ్లినప్పుడు ఈ దాడి జరిగింది. ఇరాన్ సుప్రీం లీడర్ (Iran Supreme Leader) తర్వాత అత్యంత శక్తిమంతమైన నేత అయిన లారిజానీ మరణం ఇరాన్‌ను తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యేలా చేసింది.
యుద్ధం మొదలైనప్పటి నుంచి అత్యంత కట్టుదిట్టమైన భద్రత నడుమ తరచూ నివాసాలు మారుస్తూ లారిజానీ శత్రువు కంటపడకుండా జాగ్రత్త పడుతున్నారు. అయితే మార్చి 17న రాత్రి ఆయన తన కుమార్తె ఇంటికి వెళ్తున్నట్లు ఇజ్రాయెల్ నిఘా సంస్థ మొసాద్ పక్కా సమాచారం సేకరించింది. బిడ్డ ఇంట్లోకి లారిజానీ ప్రవేశించిన కొన్ని క్షణాల్లోనే ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు క్షిపణులతో విరుచుకుపడ్డాయి.
ఈ భీకర దాడిలో భవనం పూర్తిగా కుప్పకూలిపోవడంతో అలీ లారిజానీతోపాటు ఆయన కుమారుడు మొర్తెజా, కార్యాలయ అధిపతి బయట్ కూడా అక్కడికక్కడే మరణించారు. ఇరాన్ వ్యూహాలకు వెన్నెముకగా ఉన్న లారిజానీని అంతమొందించడమే లక్ష్యంగా ఇజ్రాయెల్ ఈ ఆపరేషన్ చేపట్టినట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి 28న సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ మరణించిన తర్వాత ఇరాన్ నాయకత్వ సంక్షోభాన్ని ఎదుర్కుంటోంది.
ఈ కీలక సమయంలో దేశ అణు కార్యక్రమాలు, విదేశీ సంబంధాల్లో చక్రం తిప్పే లారిజానీ మరణం ఇరాన్‌కు కోలుకోలేని దెబ్బగా అంతర్జాతీయ నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఈ దాడిపై ఇజ్రాయెల్ రక్షణ మంత్రి స్పందిస్తూ.. లారిజానీ, ఆయన అనుచరులు ఇప్పుడు నరకంలో ఉన్నారని వ్యాఖ్యానించారు. కాగా ఈ ఘటనను తమ దేశ చరిత్రలోనే అతిపెద్ద నిఘా వైఫల్యంగా ఇరాన్ పరిగణిస్తోంది. తమ అగ్రనేత హత్యకు ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ ప్రభుత్వం వార్నింగ్ ఇచ్చింది.