PM Modi | జమ్మూకశ్మీర్ (Jammu Kashmir)లో పొలిటికల్ హీట్ పెరిగింది. దాదాపు పదేళ్ల తర్వాత అక్కడ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అన్ని పార్టీలూ తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ఎన్నికల సమరంలో దూకుడు పెంచుతున్నాయి. గెలుపే లక్ష్యంగా ఇప్పటికే అన్ని పార్టీల నేతలు తమ ప్రచారాన్ని ముమ్మరంగా సాగిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) నేటి నుంచి ఎన్నికల ప్రచారంలోకి దిగనున్నారు. ఇవాళ జమ్మూ కశ్మీర్‌లోని దోడా జిల్లాలో ప్రధాని మోదీ ఎన్నికల ర్యాలీ నిర్వహించబోతున్నారు.
భారత ప్రధాన మంత్రి ఒకరు దోడాలో పర్యటించడం దాదాపు 42 ఏళ్లలో ఇదే తొలిసారి కావడం (1st visit by Indian Prime Minister) విశేషం. 1982లో చివరి సారిగా ప్రధాన మంత్రి ఈ ప్రాంతంలో పర్యటించారు. ‘ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దోడాలో తన మొదటి ఎన్నికల సమావేశాన్ని నిర్వహించనున్నారు. 42 ఏళ్లలో ప్రధాని పర్యటించడం ఇదే తొలిసారి. 1982లో దోడాలో అప్పటి ప్రధాన మంత్రి చివరిసారిగా పర్యటించారు’ అని కేంద్ర మంత్రి, జమ్మూ కశ్మీర్‌కు బీజేపీ ఎన్నికల ఇన్ఛార్జ్ కిషన్ రెడ్డి తెలిపారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో దోడా, కిష్త్వార్ ప్రాంతాల్లో అధికారులు భద్రతను కట్టుదిట్టం చేశారు. మోదీ చేపట్టే ఎన్నికల ర్యాలీని శాంతియుతంగా, సజావుగా నిర్వహించేందుకు బహుళ స్థాయి భద్రతను మోహరించారు.
ఇక జమ్మూ కశ్మీర్ ఎన్నికలతోపాటు హర్యానా అసెంబ్లీకి కూడా ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఆ రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీజేపీ.. మూడోసారి అధికారం చేపట్టేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలోనే మోదీ దోడా పర్యటన తర్వాత హర్యానాలోని కురుక్షేత్రలో తన మొదటి ఎన్నికల ర్యాలీలో ప్రసంగించనున్నారు.
జమ్మూ కశ్మీర్ ఎన్నికలు మూడు దశల్లో సెప్టెంబర్ 18, 25, అక్టోబర్ 1 న జరగనున్న విషయం తెలిసిందే. ఇక అక్టోబర్ 5న హర్యానా అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతాయి. రెండు రాష్ట్రాలకు అక్టోబర్ 8న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను వెల్లడిస్తారు.
Also Read..
Sitaram Yechury | ఏకేజీ భవన్‌కు ఏచూరి పార్థివదేహం.. ప్రముఖుల నివాళులు
Militants Killed: బారాముల్లాలో ఎన్కౌంటర్.. ముగ్గురు మిలిటెంట్లు హతం
Artificial Intelligence | ఏఐని నమ్ముకుంటే.. మన తెలివి తెల్లారిపోయినట్టే!