Artificial Intelligence | చదువుల్లో, ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో అంతటా పోటీ వాతావరణమే. ఈ పోటీ ఇప్పటివరకు మనుషుల మధ్యే! కానీ, భవిష్యత్తులో మన పోటీదారు ఎవరో తెలుసా? ఇప్పుడు మనం వాడేందుకు ఎంతగానో ఇష్టపడే ఏఐ. అవును.. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ మన తెలివిని తెల్లారిపోయేలా చేస్తున్నది. మనల్ని బద్ధకస్తుల్ని చేసేస్తున్నది. ఎంతలా అంటే.. మన గురించి మనం చెప్పుకోవడం మానేసి.. ఏఐని చెప్పమనే స్థితికి వచ్చేశాం. అందుకే.. తాజాగా కొన్ని కంపెనీలు ఓ ట్విస్ట్ ఇస్తూ ప్రకటనలు జారీ చేశాయి. ఏఐతో క్రియేట్ చేసిన రెజ్యూమెలను నమ్మేంత పిచ్చోళ్లం కాదంటున్నాయి.
అలా జెనరేట్ చేస్తే రిజెక్ట్ చేస్తామని కుండబద్దలు కొడుతున్నాయి. ఎందుకిలా అంటే.. “టెల్ అజ్ అబౌట్ యువర్ సెల్ఫ్?’ అని అడిగితే.. మీరు చెబుతారా? ఏఐ వచ్చి చెబుతుందా?’ అని అభ్యర్థుల్ని ప్రశ్నిస్తున్నాయి. బ్యాంకింగ్, ఫైనాన్షియల్, టెక్నాలజీ, టెలికమ్యూనికేషన్స్, లాజిస్టిక్స్.. లాంటి రంగాల్లో ఈ రకమైన ఏఐ రెజ్యూమెల వడపోత పక్కాగా అమలు చేస్తున్నాయి కంపెనీలు.
తమ స్కిల్స్‌ని అభ్యర్థులు స్వయంగా రాసినట్టుగా అనిపిస్తే మాత్రమే ఆ రెజ్యూమెలను పరిగణనలోకి తీసుకుంటున్నాయి. ఏఐ టూల్స్‌తో డెవలప్ చేసినవి బుట్టదాఖలు చేస్తున్నాయి. కొన్ని సర్వేల ప్రకారం ఏఐ టూల్స్ వాడి రెజ్యూమెలు రాస్తున్నవారి శాతం పెరుగుతున్నదట. అమెరికాలో 28 శాతం మంది ఏఐని విరివిగా వాడుతున్నారట. జెనరేషన్ ‘జెడ్’ ఏఐ టూల్స్ వాడకంలో ముందు వరుసలో నిలుస్తున్నది.
ఈ నేపథ్యంలో వ్యక్తిగత విషయాలను వెల్లడించడానికి కూడా ఏఐపై ఆధారపడుతున్న వాళ్లలో ఏపాటి స్కిల్స్ ఉంటాయో అన్న అనుమానం కొద్దీ.. కంపెనీలు కాస్త కఠినంగానే వ్యవహరిస్తున్నాయి. ఏది ఏమైనా.. కెరీర్‌కి కీలకమైన రెజ్యూమెను క్రియేట్ చేయడంలో ఏఐ సాయం తీసుకున్నప్పటికీ చివరగా.. మీరే క్షుణ్నంగా రీరైట్ చేసుకుని స్పష్టంగా, సెన్సిబుల్‌గా ఉండేలా జాగ్రత్తపడటం అవసరం!