PM Modi | ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor)తో మన దేశ సైనికుల సత్తా ప్రపంచం మొత్తం చూసిందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) అన్నారు. నేటి నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు (Parliament Monsoon Session) ప్రారంభం అయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సమావేశాలు ప్రారంభానికి ముందు పార్లమెంట్ ఆవరణలో ప్రధాని మీడియాతో మాట్లాడారు. వర్షాకాల సమావేశాలు ఫలప్రదం కావాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.
ఆపరేషన్ సిందూర్‌లో మన సైనికులు వందశాతం లక్ష్యాలను సాధించినట్లు చెప్పారు. కేవలం 22 నిమిషాల్లోనే ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేసినట్లు గుర్తు చేశారు. ఈ ఆపరేషన్‌తో మన సైనిక సామర్థ్యం, గొప్పతనం ప్రపంచం మొత్తం చూసిందన్నారు. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా మేడిన్ ఇండియా ఆయుధాల గురించే మాట్లాడుతోందన్నారు. ఉగ్రవాదాన్ని, నక్సలిజాన్ని నిర్మూలించేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నట్లు ప్రధాని పేర్కొన్నారు. ‘ఆపరేషన్ సిందూర్’ విజయం గురించి మన దేశ ఎంపీలు ప్రపంచంలోని వివిధ దేశాల్లో పర్యటించి వివరించారని మోదీ గుర్తు చేశారు.
పాక్ దుష్ట చర్యలను అంతర్జాతీయంగా ఎండగట్టినట్లు చెప్పారు. తుపాకులు, బాంబులు ఉన్నా మన రాజ్యాంగం ముందు నిలబడలేకపోయాయని స్పష్టంచేశారు. ఈ వర్షాకాల పార్లమెంట్ సమావేశాల్లో ‘ఆపరేషన్ సిందూర్’ విజయంపై వేడుక చేసుకోవాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. దేశ ప్రయోజనాల విషయంలో రాజకీయ పార్టీలూ, ప్రతీ ఒక్కరూ ఐక్యతతో ముందుకు సాగాలని సూచించారు.
ఈ సందర్భంగా భారత వ్యోమగామి శుభాన్షు శుక్లా అంతరిక్ష యాత్ర గురించి కూడా ప్రధాని మోదీ ప్రస్తావించారు. శుభాన్షు శుక్లా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లి రావడంపై మోదీ హర్షం వ్యక్తం చేశారు. ఐఎస్ఎస్లో మన జాతీయ జెండా ఎగరడం దేశ ప్రజలందరికీ గర్వకారణం అని కొనియాడారు. ఇక రైతుల జీవనోపాధి, దేశ ఆర్థిక వ్యవస్థ వర్షాలపై ఆధారపడి ఉందన్నారు.
Also Read..
Parliament Monsoon Session | పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం.. విపక్షాల వాయిదా తీర్మానాలు
Mumbai train blasts case | ముంబై రైలు పేలుళ్ల కేసులో బాంబే హైకోర్టు సంచలన తీర్పు