Parliament Monsoon Session | పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు (Parliament Monsoon Session) ప్రారంభమయ్యాయి. ఉదయం 11 గంటలకు ఉభయసభలు సమావేశమయ్యాయి. ఈ సమావేశాల సందర్భంగా విపక్ష పార్టీలకు చెందిన ఎంపీలు పలు వాయిదా తీర్మానాలు ప్రవేశపెట్టారు. పహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్, బీహార్ ఓటర్ జాబితాలపై తీర్మానాలు ఇచ్చారు. అదేవిధంగా ఇంటెలిజెన్స్ వైఫల్యాలు, టెర్రరిస్ట్‌లను ఇంత వరకూ అరెస్ట్ చేయకపోవడంపై ప్రభుత్వం వివరణ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.
మరోవైపు పహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్ తర్వాత మొదటిసారిగా ఉభయ సభలు సమావేశమయ్యాయి. దీంతో సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఇండియా కూటమి నేతృత్వంలోని విపక్షాలు ఇప్పటికే వ్యూహరచన చేశాయి. అధికార కూటమి కూడా ప్రతిపక్షాలను ఎదుర్కొనేందుకు పూర్తి సన్నద్ధంగా ఉంది. నేటి నుంచి ఆగస్టు 21 వరకు దాదాపు 21 రోజులపాటు జరుగనున్న ఈ సమావేశాలు వాడీవేడిగా కొనసాగే అవకాశాలున్నాయి.
మరోవైపు ఈ సమావేశాల్లో ఏడు పెండింగ్ బిల్లులతోపాటు 8 కొత్త బిల్లులను ప్రవేశపెట్టడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. నేషనల్ స్పోర్ట్స్ గవర్నెన్స్ బిల్లు, జియోహెరిటేజ్ సైట్స్, జియో రెలిక్స్ (సంరక్షణ, నిర్హణ) బిల్లు, మైన్స్ అండ్ మినరల్స్ (అభివృద్ధి, నియంత్రణ) సవరణ బిల్లు, నేషనల్ యాండీ డోపింగ్ (సవరణ) బిల్లు, మణిపూర్ వస్తు సేవల పన్ను (సవరణ) బిల్లు వంటివి ఇందులో ఉన్నాయి. వీటితోపాటు ఇన్‌కం ట్యాక్స్-2025 బిల్లును కూడా కేంద్రం ప్రవేశపెట్టే అవకాశాలు ఉన్నాయి. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న అలహాబాద్ హైకోర్టు సిటింగ్ న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్‌వర్మను అభిశంసించే తీర్మానం కూడా ఈ సమావేశాలలోనే పార్లమెంటు ముందుకు రానుంది.
Also Read..
Mumbai train blasts case | ముంబై రైలు పేలుళ్ల కేసులో బాంబే హైకోర్టు సంచలన తీర్పు
భార్యను వదిలేసి వెళ్లిపోయిన కేంద్ర మంత్రి !
అసెంబ్లీలో మహారాష్ట్ర మంత్రి పేకాట