ముంబై, జూలై 20 (నమస్తే తెలంగాణ) : ఒక పక్క అసెంబ్లీ సమావేశాలు జరుగుతుండగా, తనకేమీ సంబంధం లేనట్టు ఎన్సీపీ (అజిత్ వర్గం)కి చెందిన మహారాష్ట్ర వ్యవసాయ మంత్రి మాణిక్‌రావు అసెంబ్లీ హాల్లో తన ఫోన్లో పేకాట ఆడుకుంటున్న దృశ్యం తీవ్ర విమర్శలకు దారితీసింది. మహారాష్ట్రలో అధికారంలో ఉన్న బీజేపీ, ఎన్సీపీ (అజిత్ పవార్) కూటమిపై విపక్షాలు తీవ్రంగా మండిపడ్డాయి. మంత్రి రాజీనామా చేయాలని డింమాండ్ చేచశారు.
ఎన్సీపీ (శరద్ పవార్) నేత రోహిత్ పవార్ మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రతి రోజు 8 మంది రైతులు ఉసురుతీసుకుంటున్నారని, లెక్కలేనన్ని సమస్యలతో రైతులు బాధపడుతున్నారని, అయినా ఇవేమీ పట్టకుండా మంత్రి రమ్మీ ఆడటంలో బిజీగా మారిపోయారని విమర్శించారు. ‘ఈ తప్పుదారి పట్టిన మంత్రులు రైతుల సమస్యలను ఎప్పుడైనా వింటారా? అప్పుడప్పుడూ పేద రైతుల కష్టాలు తెలుసుకోవడానికి పంట పొలాల్లోకి రండి మహారాజా’ అని రోహత్ పవార్ ఎక్స్‌లో పేర్కొన్నారు.