అహ్మదాబాద్ : గుజరాత్ పర్యటనలో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తన భార్యను జునాగఢ్‌లో మర్చిపోయి రాజ్‌కోట్‌కు బయలుదేరిన ఘటన చోటుచేసుకుంది. విమానాన్ని అందుకోవాలన్న ఆత్రుతలో ఈ ఘటన చోటుచేసుకుంది. గుజరాత్ పర్యటనకు వచ్చిన మంత్రి తన భార్య సాధనాసింగ్తో కలిసి సోమనాథ్ జ్యోతిర్లింగాలను, గిర్‌లోని సింహాల అభయారణ్యాన్ని ఉదయం సందర్శించారు. తర్వాత జునాగఢ్‌లోని గ్రౌండ్నట్ రిసెర్చ్ సెంటర్లో జరిగిన ఒక ప్రజా కార్యక్రమానికి హాజరయ్యారు.
అయితే విమానానికి ఆలస్యం అవుతుండటంతో ఆయన తన ప్రసంగాన్ని త్వరగా ముగించి అక్కడి నుంచి రాజ్‌కోట్‌కు బయలుదేరారు. కాగా, అప్పటికే గిర్నర్ దేవాలయ దర్శనం చేసుకుని వచ్చిన ఆయన భార్య సెంటర్ వెయిటింగ్ రూమ్‌లో వేచి చూస్తున్నది. అయితే ఈ విషయం మరచి మంత్రి అక్కడి నుంచి వెళ్లిపోయారు. కొంత దూరం వెళ్లాక భార్య సంగతి గుర్తుకు వచ్చి, కాన్వాయ్‌ను తిరిగి వెనక్కి తిప్పించారు. సాధనాసింగ్ను ఎక్కించుకుని తిరిగి రాజ్‌కోట్‌కు వెళ్లిపోయారు.