Traffic Challan | న్యూఢిల్లీ, జూలై 20: చిన్న పిల్లలతో కలిసి వెళ్తూ ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడే వాహనదారులకు రెట్టింపు జరిమానా విధించాలని రోడ్డు రవాణా శాఖ ప్రతిపాదించింది. వాహనదారుల భద్రతను, జవాబుదారీ తనాన్ని పెంపొందించేందుకు ఈ ప్రతిపాదన చేసింది. అంతేకాకుండా ట్రాఫిక్ నిబంధనలు పాటింపు లేదా ఉల్లంఘన ఆధా రంగా డ్రైవర్లకు ‘మెరిట్ అండ్ డీమెరిట్’ (పాజి టివ్, నెగెటివ్) పాయింట్ సిస్టమ్‌ను కూడా ప్రతిపాదించింది.
మోటార్ వాహనాల చట్టం సవరణల్లో భాగంగా ప్రతిపాదించిన ఈ మార్పులపై అన్ని మంత్రిత్వ శాఖలు తమ అభి ప్రాయాన్ని తెలియజేయాలని రోడ్డు రవాణా శాఖ కోరినట్టు తెలుస్తున్నది. వాహనాల్లో చిన్నపిల్లలను తీసుకెళ్లే అనేక మంది తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు, పాఠశాలల బస్సు డ్రైవర్లు ట్రాఫిక్ నిబంధనలను పాటించకపోవడాన్ని దృష్టిలో పెట్టుకుని జరిమానాను రెట్టింపు చేయాలని ప్రతిపాదించినట్టు అధికార వర్గాలు వెల్లడించాయి. అయితే ట్రాఫిక్ నేరాల జాబితాలోని ఏదైనా అంశాన్ని నిష్పాక్షికంగా అమలు చేయకపోతే అది కేవలం ఓ ‘మెరుగైన’ శాసన కసరత్తుగా, అవినీతికి మరొక మార్గంగా మిగిలిపోతుందని రోడ్డు భద్రతా నిపుణుల్లో ఓ వర్గం భావిస్తున్నది. మోటార్ వాహనాల చట్టం 100కుపైగా నేరా లను కవర్ చేస్తున్నప్పటికీ వేగంగా వాహనాలు నడపడం, మద్యం సేవించి వాహనాలు నడపడం, రెడ్ సిగ్నల్ జంపింగ్, ఫోన్లను ఉపయోగించడం, సీట్ లేదా హెల్మెట్ ధరించకపోవడం లాంటి అరడజను నేరాల్లో మాత్రమే ట్రాఫిక్ పోలీసులు డ్రైవర్లను పట్టు కొని శిక్షించగలుగుతున్నారని వారు గుర్తు చేస్తున్నారు.